NTV Telugu Site icon

ఐపీఎల్ 14 సీజన్‌ లో రికార్డులు ఇవే…

ఐపీఎల్ 14 సీజన్‌ ఎన్నో రికార్డులకు వేదికైంది. మిస్టర్ కూల్‌ ధోనీ కెప్టెన్సీకి తోడు యువక్రీడాకారుల అద్భుత ప్రతిభ తోడు కావడంతో… నాలుగోసారి చెన్నై కప్ అందుకుంది. ఈ ఐపీఎల్‌పోరులో యువతరంగాలు రుతురాజ్, హర్షల్ పటేల్,వెంకటేష్ అయ్యర్… మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఈ సారి ఐపీఎల్ పండుగ ఆద్యంతం అభిమానులను అలరించింది.

ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆర్భాటంగా ముగిసింది. ఎంతో మంది కొత్త క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. ఎన్నో రికార్డులు బద్దలు కాగా…మరెన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయ్. చెన్నై సూపర్ కింగ్స్‌…నాల్లోసారి టైటిల్‌ను ముద్దాడింది.

కోలకత్తా, ఆర్సీబీ, ఢిల్లీ కేపిటల్స్‌…ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాయ్. ఆయా జట్లలోని పలువురు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. దీంతో టోర్నీ నిర్వాహకులు వారందరినీ ప్రత్యేక అవార్డులతో సత్కరించారు. వీరందరిలో అత్యంత విలువైన అటగాడు కూడా హర్షల్ పటేలే.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌… ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్‌ద సీజన్‌గా నిలిచాడు.ఒక సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలతో …మొత్తం 635 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్ అందుకున్నాడు.

బెంగళూరు ఆటగాడు హర్షల్ పటేల్‌…32 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ దక్కించుకున్నాడు. ఓ మ్యాచ్‌లో ఐదు, మరోమ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రావోతో సమానంగా నిలిచాడు. గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ది సీజన్‌ అవార్డు దక్కించుకున్నాడు హర్షల్ పటేల్.

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్…10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. పవర్‌ ప్లేయర్ ఆఫ్‌ ది సీజన్‌ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఏకంగా 30 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కేఎల్‌ రాహుల్ రికార్డు సాధించాడు. ఢిల్లీ ప్లేయర్‌ సిమ్రన్ హెట్‌మైయర్…సూపర్‌ స్ట్రైకర్ ఆఫ్‌ ది సీజన్‌గా నిలిచాడు.

కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ సునీల్‌ నరైన్‌ ఆడిన షాట్‌ను గాల్లో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు కింగ్స్‌ ఎలెవన్‌ ఆటగాడు రవి బిష్ణోయ్‌. ఫెయిర్‌ ప్లే అవార్డు రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది.