Vaibhav Sooryavanshi: టీ20ల్లో చరిత్ర సృష్టించే ఛాన్స్.. వైభవ్ సూర్యవంశీ ఆ రికార్డు బద్దలు కొడతాడా?

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: భారత్-జింబాబ్వే మధ్య ఇవాళ ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అంతా దృష్టి సారించారు.. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ బ్యాటర్‌కు టీ20 క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సాధించే అవకాశం లభించింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్‌లో 37 ఇన్నింగ్స్‌ల్లో 139 సిక్సర్లు బాదాడు. జింబాబ్వేతో జరిగే ఈ సిరీస్‌లో మరో 11 సిక్సర్లు కొడితే అతని ఖాతాలో 150 సిక్సర్లు చేరతాయి. దీంతో అత్యల్ప ఇన్నింగ్స్‌ల్లో 150 టీ20 సిక్సర్లు పూర్తి చేసిన ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు యూఏఈ బ్యాటర్ మహ్మద్ వసీమ్ పేరిట ఉంది. అతను 66 ఇన్నింగ్స్‌ల్లో 150 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.

ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్‌కు జింబాబ్వే సిరీస్ తన ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశం కానుంది. మూడు మ్యాచ్‌ల్లోనూ అతడికి అవకాశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు, హరారే మైదానంతో వైభవ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఇదే వేదికలో అతడు 175 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే జింబాబ్వేలో ఆడిన ఏడు యూత్ వన్డేల్లో 62.17 సగటుతో 439 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే హరారేలో అతడు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.