Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత జట్టు నుంచి తనను తప్పించడంపై తొలిసారి బహిరంగంగా స్పందించాడు. సెలెక్టర్ల నిర్ణయం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని, అసలు “ఇది ఎలా సాధ్యం?” అనే ప్రశ్న తనను కొంతకాలం వెంటాడిందని సూర్యకుమార్ వెల్లడించాడు. 2024 జూలైలో భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్.. తన నాయకత్వంలో ఒక్క టీ20 సిరీస్‌లో కూడా ఓటమి చవిచూడలేదు. అతని సారథ్యంలో భారత్ ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే ఈ ఏడాది టోర్నీ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు ఎంపిక చేసిన జట్టులో సూర్యకు చోటు దక్కలేదు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించారు.
భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన సంభాషణలో సూర్యకుమార్ ఈ పరిణామంపై తన మనసులోని మాటలను వెల్లడించాడు. జట్టు ప్రకటన సమయంలో తన పేరు లేకపోవడం చూసినప్పుడు మొదట నవ్వానని చెప్పాడు. గత ఏడాది కాలంగా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నవ్వుతూ, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. తనకు లభించిన అవకాశాల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఈ నిర్ణయం తనను ఆలోచనలో పడేసిందని సూర్య చెప్పాడు. “ఇది ఎలా జరగగలిగింది? ఇది ఎలా సాధ్యం?” అనే ప్రశ్నలు తనను వేధించాయని వెల్లడించాడు. 2026 తర్వాత మరో రెండేళ్ల పాటు తానే భారత టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తానని భావించానని తెలిపాడు.
ఒలింపిక్స్, ఆ తర్వాత మరో టీ20 ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలు ముందున్న నేపథ్యంలో తన నాయకత్వ ప్రయాణం కొనసాగుతుందని అనుకున్నట్లు సూర్యకుమార్ చెప్పాడు. అయితే భవిష్యత్తుకు ఇదే సరైన నిర్ణయమని సెలెక్టర్లు భావించి ఉంటే.. దాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశాడు. వారి నిర్ణయంపై తాను ఎలాంటి వివాదానికి దిగలేదని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై కూడా సూర్యకుమార్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. శ్రేయస్ తనకు చాలా కాలంగా తెలుసని, అతను మంచి ఆటగాడే కాకుండా మంచి వ్యక్తి, మంచి నాయకుడు కూడా అని ప్రశంసించాడు. అతనిపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. అయితే తనకు అసలు బాధ కలిగించింది మాత్రం జట్టు విజయాల పరంపర కొనసాగుతున్న సమయంలో నాయకత్వంలో మార్పు ఎందుకు అవసరమైందన్నదేనని సూర్యకుమార్ తెలిపాడు. గత రెండేళ్లలో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదని, ప్రపంచకప్, ఆసియా కప్ గెలిచామని గుర్తుచేశాడు. అలాంటి సమయంలో అంతా సజావుగా సాగుతున్నప్పుడు ఈ మార్పు ఎందుకు వచ్చిందనే ప్రశ్న తనలో తలెత్తిందని చెప్పాడు.
జట్టు నుంచి తప్పించిన తర్వాత సుమారు నెలన్నర పాటు ఇంట్లోనే ఉండి ఈ విషయంపై ఆలోచించానని సూర్య వెల్లడించాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు తనను ఓదార్చుతూ ఇది జీవితంలో భాగమేనని చెప్పారని తెలిపాడు. కానీ అందరూ వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న సమయంలో ఈ నిర్ణయం గురించి మళ్లీ ఆలోచించేవాడినని చెప్పాడు. తనను జట్టులోకి ఎంపిక చేయరనే విషయం అధికారిక ప్రకటనకు రెండు, మూడు రోజుల ముందే తనకు తెలిసిందని సూర్యకుమార్ వెల్లడించాడు. సెలక్షన్ కమిటీ నుంచి ఫోన్ వచ్చి ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పారని వివరించాడు. ఆ నిర్ణయం తనది కాదని, జట్టుకు అదే ఉత్తమమని భావించి సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని స్పష్టం చేశాడు.
మరోవైపు, సూర్యకుమార్ ప్రకటనతో ఈ వ్యవహారంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు భవిష్యత్ జట్టును నిర్మించడం, బ్యాటింగ్ ప్రదర్శన వంటి అంశాలను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుని ఉండొచ్చు. మరోవైపు అతని నాయకత్వంలో భారత టీ20 జట్టు సాధించిన విజయాలు కూడా గణనీయమైనవే. దీంతో ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్‌ను ఆ తర్వాత జట్టు నుంచి ఎందుకు తప్పించారనే చర్చ మరోసారి మొదలైంది. తన బాధ, నిరాశ, అయోమయాన్ని సూర్యకుమార్ తొలిసారి బహిరంగంగా వెల్లడించడంతో.. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

