Simon Harmer: కొన్ని సార్లు బౌలర్లే బ్యాట్‌కి పని చెబుతారు.. మరికొన్ని సార్లు బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వారే.. బాల్ అందుకొని వికెట్లు తీస్తుంటారు.. ఇప్పుడు అలాంటిదే మరోసారి జరిగింది.. ఏకంగా 18 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టేలా చేసింది.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. గెబార్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసి, డేల్ స్టెయిన్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. తొలి టెస్టులో 214 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పోరాటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
మ్యాచ్ మూడో రోజు హార్మర్ 91 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై తొమ్మిదో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. 2008 మెల్బోర్న్ టెస్టులో డేల్ స్టెయిన్ చేసిన 76 పరుగులే గతంలో అత్యధికం. ఇక, తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ టెంబా బవుమా, మార్కో జాన్సెన్ జట్టును ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. జాన్సెన్ 85 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్మర్.. బవుమాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 183 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా టెస్టు చరిత్రలో ఎనిమిదో వికెట్ లేదా అంతకంటే దిగువన నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ఇది రెండోది. 1998లో పాకిస్థాన్‌పై మార్క్ బౌచర్, పాట్ సిమ్‌కాక్స్ నెలకొల్పిన 195 పరుగుల భాగస్వామ్యం అగ్రస్థానంలో ఉంది.
కెప్టెన్ బవుమా అద్భుత ఇన్నింగ్స్
మరోవైపు, కెప్టెన్ టెంబా బవుమా ఒత్తిడిని తట్టుకుంటూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 334 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 179 పరుగులు సాధించాడు. తొలి రోజు దక్షిణాఫ్రికా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో బాధ్యత తీసుకుని జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. హార్మర్‌కు తొలి టెస్టు సెంచరీ సాధించే అవకాశం వచ్చినప్పటికీ, మార్నస్ లబుషేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బవుమా పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా 425/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి మూడు పరుగులు చేసింది. కగిసో రబాడా నిక్ మ్యాడిన్సన్ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పోరాటం మ్యాచ్‌పై ఉత్కంఠను పెంచింది.

