Site icon NTV Telugu

Shubman Gill: శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో ఆడనున్న రోహిత్, విరాట్.. తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గిల్..

Shubman Gill

Shubman Gill

Shubman Gill: పెర్త్‌లో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు సిద్ధమవుతోంది టీమిండియా.. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు.. రేపు జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు ప్రాక్టీస్‌లో మునిగిపోయింది.. అయితే, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో అనుభవజ్ఞులైన బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు.. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ గిల్ నాయకత్వంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఈ ఇద్దరు స్టార్‌ ప్లేయర్స్‌ తొలిసారి ఆడుతుండడంతో.. ఆసక్తిరంగా మారింది.. ఈ పరిణామాలపై ఫస్ట్‌ టైం స్పందించారు టీమిండియా కెప్టెన్‌ గిల్..

అయితే, కెప్టెన్సీ మారినప్పటికీ రోహిత్‌తో తన అనుబంధం మారలేదని పేర్కొన్నారు గిల్.. క్రికెటర్‌గా గిల్ తన బాల్యంలో ఆరాధించిన ఆటగాడు కోహ్లీ విషయంలో కూడా ఇదే జరుగుతుందన్నారు.. బయట కథనాలు ఎలా ఉన్నా, మా మధ్య అలాంటిదేమీ జరగలేదు.. ఇది గత కాలంలాగే ఉంది. అతను చాలా సపోర్ట్‌గా ఉంటాడు.. ఎల్లప్పుడూ తన అనుభవాలను పంచుకుంటాడు.. నేను కూడా రోహిత్‌ సలహాలను తీసుకుంటాను అని స్పష్టం చేశాడు.. ‘నువ్వు కెప్టెన్ అయితే ఈ వికెట్‌పై ఏం చేసేవాడివి?’ అని నేను రోహిత్‌ను అడుగుతాను.. ఇతర ఆటగాళ్ల ఆలోచనలను తెలుసుకోవడం అంటే నాకు ఇష్టం” పెర్త్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నాడు గిల్..

ఇక, నాకు విరాట్ మరియు రోహిత్ భాయ్ ఇద్దరితోనూ మంచి అనుబంధం ఉంది.. నేను ఎల్లప్పుడూ వారి సలహా తీసుకుంటాను, వారు తమ అభిప్రాయాన్ని ఇవ్వడానికి వెనుకాడరు అని గిల్ తెలిపాడు.. టెస్ట్‌లలో ఇప్పటివరకు కెప్టెన్‌గా ఆకట్టుకున్న 25 ఏళ్ల గిల్.. ఇద్దరు మాజీ భారత కెప్టెన్ల నుండి నాయకత్వం పరంగా మరింత నేర్చుకోవడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో నేను వారి నుండి నేర్చుకోగలిగే క్షణాలు చాలా ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను క్లిష్ట పరిస్థితిలో ఉంటే, వారి నుండి సలహా తీసుకోవడానికి నేను వెనుకాడను అని తెలిపారు.. అయితే, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనపై చాలా బాధ్యతలు ఉన్నాయని గిల్ అంగీకరించాడు.

ఖచ్చితంగా, చాలా ఉత్తేజకరమైనది.. ఎంఎస్ ధోని , విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నాకు పెద్ద అవకాశం ఉంది. చాలా అనుభవాలు ఉన్నాయి.. చాలా నేర్చుకున్నాను అని పేర్కొన్నాడు గిల్.. జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలి, భారత క్రికెట్ జట్టుకు వారు ఎలాంటి సంస్కృతిని కోరుకుంటున్నారు అనే దానిపై నేను రోహిత్, విరాట్ ఇద్దరితో అనేకసార్లు చర్చలు జరిపాను. ఆ పాఠాలు, అనుభవాలు మా జట్టు ముందుకు సాగడానికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నాడు టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్..

Exit mobile version