Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే క్రికెట్‌లో ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత 968 రోజుల విరామం అనంతరం ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన బుమ్రా, రీఎంట్రీ మ్యాచ్‌లోనే రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రాకు వికెట్ దక్కలేదు. అయితే పవర్‌ప్లే అనంతరం రెండో స్పెల్‌లో తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసి తన సత్తా చాటాడు. రోహిత్ శర్మ ఫస్ట్ స్లిప్‌లో అద్భుత క్యాచ్ అందుకోవడంతో బుమ్రా ఖాతాలో కీలక వికెట్ చేరింది.. ఈ వికెట్‌తో బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో 31 వికెట్లు పూర్తి చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు రవీంద్ర జడేజా 30 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, బుమ్రా అతడిని అధిగమించాడు. భువనేశ్వర్ కుమార్ (28), మదన్ లాల్ (27), మహ్మద్ షమీ (26) తదుపరి స్థానాల్లో ఉన్నారు.

అంతేకాకుండా హ్యారీ బ్రూక్ వికెట్ బుమ్రా వన్డే కెరీర్‌లో 150వ వికెట్ కావడం మరో విశేషం. దీంతో వన్డేల్లో 150 వికెట్లు పూర్తి చేసిన భారత బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కేవలం 4,605 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన బుమ్రా, అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ (4,070 బంతులు), కుల్దీప్ యాదవ్ (4,513 బంతులు) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తాము ముందుగా బౌలింగ్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నామని వెల్లడించాడు. టీ20 సిరీస్ అనంతరం జట్టులో మంచి వాతావరణం ఉందని, అందరూ బాగా సన్నద్ధమయ్యారని గిల్ తెలిపాడు. బుమ్రా రీఎంట్రీతో భారత బౌలింగ్ దళానికి మరింత బలం చేకూరిందని అభిమానులు భావిస్తున్నారు.