BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ

Rajeev Shukla

Rajeev Shukla

BCCI: హైదరాబాద్‌ క్రికెటర్‌, టీమిండియా స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు అన్యాయం జరిగిదంటూ.. టీమిండియా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, చివరకు రాజకీయ నేతలు కూడా విమర్శలు గుప్పతించారు.. అయితే, న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన టెస్టులో భారత తుది జట్టు నుంచి స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను తప్పించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సిరాజ్‌ను అనవసరంగా వివాదాల్లోకి లాగడం సరికాదని స్పష్టం చేశారు. తుది జట్టును ఎంపిక చేసే అధికారం కెప్టెన్, కోచ్‌లకు ఉంటుందని తెలిపారు.

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?
వెల్లింగ్టన్ టెస్టులో భారత్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్‌తో పాటు తన రెండో టెస్టు ఆడుతున్న అన్షుల్ కంబోజ్‌కు అవకాశం కల్పించింది. అయితే 48 టెస్టుల అనుభవం ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 239 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలన్న భారత అవకాశాలకు గట్టి దెబ్బగా మారింది.

సిరాజ్ ఎంపికపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి
పచ్చికతో కూడిన పిచ్‌లపై సిరాజ్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ను పక్కన పెట్టడంపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఈ నిర్ణయాన్ని అంగీకరించడం కష్టమని వ్యాఖ్యానించారు. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా సిరాజ్ అనుభవం, దూకుడు, సీమ్ మూవ్‌మెంట్‌ను ఉపయోగించుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, ఈ వివాదంపై పీటీఐతో మాట్లాడిన రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. “సిరాజ్‌ను ఏ వివాదంలోకి లాగకూడదని నేను భావిస్తున్నాను. అది సరైన పద్ధతి కాదు. తుది జట్టును ఎంపిక చేసే బాధ్యత కోచ్, కెప్టెన్‌ది. ఒక ఆటగాడిని అనవసరంగా ఇలాంటి వివాదాల్లోకి లాగడం మంచిది కాదు” అని పేర్కొన్నారు. సిరాజ్‌ను క్రికెట్‌కు సంబంధం లేని ఇతర కారణాలతో జట్టు నుంచి తప్పించారన్న ఊహాగానాలను కూడా ఆయన ఖండించారు. అలాంటి ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. పిచ్ పరిస్థితులు, వికెట్ స్వభావం, మ్యాచ్‌కు అనుకూలమైన బౌలింగ్ కూర్పు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే తుది జట్టును నిర్ణయిస్తారని వివరించారు. సిరాజ్ ఇప్పటికీ భారత జట్టులో భాగమేనని తెలిపారు.

వరుసగా రెండో టెస్టు డ్రా.. టీమిండియాపై ప్రశ్నలు
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టుకు ఇది వరుసగా రెండో టెస్టు డ్రాగా నిలిచింది. అంతకుముందు ఆగస్టు ప్రారంభంలో కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లకు 503 పరుగులు చేసి డిక్లేర్ చేయగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 429 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో భారత జట్టు మ్యాచ్ చివరి దశల్లో అనుసరిస్తున్న వ్యూహాలపై చర్చ మొదలైంది.