India Women vs Australia Women: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు భవితవ్యం నేడు తేలనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా బలమైన ఆస్ట్రేలియాతో కీలక పోరుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఫలితమే భారత్ సెమీఫైనల్‌కు చేరుతుందా? లేక టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందా? అన్నది నిర్ణయించనుంది. దక్షిణాఫ్రికాపై ఓటమి కారణంగా టీమిండియా సెమీస్ ఛాన్సెస్ క్లిష్టంగా మారగా.. ఇప్పుడు చివరి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సెమీస్ చేరాలంటే భారత్ ముందున్న సమీకరణాలు ఏంటో ఓసారి చూద్దాం.
గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ:
ప్రస్తుతం గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి.. దాదాపు సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. అంతేకాకుండా +4.724 నెట్ రన్‌రేట్‌తో బలమైన స్థితిలో ఉంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా రెండూ 6 పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండు జట్లలో ఒకటి మాత్రమే ఆస్ట్రేలియాతో కలిసి సెమీఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఇంకా గ్రూప్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవైపు భారత్-ఆస్ట్రేలియా తలపడుతుండగా.. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ జట్లు పోటీ పడనున్నాయి.
భారత్ గెలిస్తే సమీకరణం ఇదే:
భారత్‌కు సెమీఫైనల్ చేరే సులభమైన మార్గం ఏదన్నా ఉందంటే.. అది ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే. ఒకవేళ హర్మన్ సేన గెలిస్తే టీమిండియా 8 పాయింట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ +2.268గా ఉండగా.. దక్షిణాఫ్రికా నెట్ రన్‌రేట్ +0.734 మాత్రమే ఉంది. కాబట్టి భారత్ గెలిస్తే నెట్ రన్‌రేట్ మరింత మెరుగవుతుంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా గెలిచినా.. వారి నెట్ రన్‌రేట్ భారత్‌ను అధిగమించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో భారత్ సెమీఫైనల్‌కు చేరుతుంది.
భారత్ ఓడితే పరిస్థితి ఏంటి?:
ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే.. సెమీస్ ఆశలు పూర్తిగా ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కంటే ముందే.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో బంగ్లా సంచలన విజయం సాధించాలని భారత్ కోరుకుంటుంది. ఆ పరిస్థితిలో భారత్, దక్షిణాఫ్రికా రెండూ 6 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టుకు సెమీఫైనల్ బెర్తు దక్కుతుంది. ప్రస్తుతం నెట్ రన్‌రేట్ పరంగా భారత్‌కు స్వల్ప ఆధిక్యం ఉండటం కలిసొచ్చే అంశం.
హర్మన్ సేనకు ‘డూ ఆర్ డై’ పోరు:
అయితే ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్ ఆస్ట్రేలియాను ఓడించాల్సిందే. ప్రపంచ ఛాంపియన్ జట్టుపై విజయం సాధిస్తే.. సెమీస్ అవకాశాలపై ఎలాంటి సందేహాలు ఉండవు. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఈ కీలక పోరుపైనే ఉంది. అయితే సూపర్ ఫామ్ మీదున్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే అంత సులువు కాదు. భారత్ తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించాల్సిందే. గత మ్యాచులలో మాదిరి పేలవ బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తే.. విజయం గురించి మర్చిపోవాల్సిందే. ప్రస్తుత భారత్ ఫామ్ చూస్తే.. ఏదైనా అద్భుతం జరగాల్సిందే.

