Aaryavir Sehwag: 338 పరుగుల లక్ష్యం చిన్నదే.. డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్ సెహ్వాగ్!

Aaryavir Sehwag

Aaryavir Sehwag

Aaryavir Sehwag Hails Mohit Ulva Batting: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో భారత యువ జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. శనివారం అల్ అమరాత్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చర్చ గురించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, లక్ష్యం మరీ పెద్దది కాదని మేము భావించాం. సాధారణంగా బ్యాటింగ్ చేస్తూ మా సహజమైన షాట్లు ఆడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే నమ్మకం మాలో ఉంది. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ ఆట తీరును మార్చుకోవాలని మేము అనుకోలేదు. జట్టు సమావేశాల్లో చివరి 10 ఓవర్లలో 100 లేదా 120 పరుగులు చేయగల సామర్థ్యం గురించి తరచూ చర్చిస్తుంటాము. అందుకే ఎవరో ఒకరు క్రీజులో నిలిచి చివరి వరకు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. లక్య ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించాడు’ అని ఆర్యవీర్ ప్రశంసించాడు.

‘చివర్లో మోహిత్ ఉల్వా, మనాల్ చేసిన బ్యాటింగ్ కూడా అద్భుతం. ఒత్తిడిలోనూ వారు జట్టును విజయానికి చేరువ చేశారు. వారి ప్రదర్శనకు ప్రత్యేకంగా అభినందనలు’ అని ఆర్యవీర్ సెహ్వాగ్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మోహిత్ 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక టోర్నమెంట్ మొత్తంలో నిలకడగా రాణించిన ఆర్యవీర్ 361 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన తండ్రితో ఇంకా మాట్లాడలేదని, తర్వాత మాట్లాడతానని తెలిపాడు. భారత్ విజయంలో లక్యతో పాటు ఆర్యవీర్, మోహిత్, మనాల్ ప్రదర్శనలు కీలకంగా నిలిచాయి.