Indian Woman Team Won Series In Englang After 23 Years: ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు సంచలనం నమోదు చేసింది. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించంది. సెంచరీతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బౌలింగ్‌లో రేణుకా సింగ్ రాణించడంతో.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో ఈ సిరీస్ కైవసం చేసుకుంది భారత్.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది. ఆరంభంలోనే షెఫాలీ వర్మ (8) ఔటైనా.. మరో ఓపెనర్ స్మృతి మందాన (40), యస్తికా (26) కొంతవరకు రాణించారు. వెంటనే వికెట్ పడనివ్వకుండా, క్రీజులో కాసేపు కుదురుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ వీరవిహారం చేసింది. 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె తొలుత హర్లీన్ డియోల్(58)తో కలిసి నాలుగో వికెట్‌కి 113 పరుగులు, ఆ తర్వాత వస్త్రాకర్(16)తో కలిసి ఐదో వికెట్‌కి 50 పరుగులు, దీప్తి శర్మ(15)తో ఆరో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాల్ని నెలకొల్పింది. దీంతో భారత మహిళల జట్టు 333/5 పరుగులు చేసింది. వన్డేల్లో భారత్‌కి ఇది రెండో అత్యధిక స్కోరు.
అనంతరం 334 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. ఆది నుంచే తడబడింది. ప్రత్యర్థి జట్టులోని ప్లేయర్స్ ఎవ్వరూ తమ సత్తా చాటలేకపోయారు. ఒక్క డానీ బ్యాట్ మాత్రమే 65 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. మిగిలిన వాళ్లంతా అంతంత మాత్రమే రాణించారు. దీంతో.. 42.2 ఓవర్లలో ఇంగ్లండ్ 245 పరుగులకే ఆలౌటూంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు, డి. హేమలత రెండు వికెట్లతో ఇంగ్లండ్ ప్లేయర్స్‌కి చుక్కలు చూపించారు. సెంచరీతో తాండవం చేయడంతో హర్మన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది
