ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!

Rohit Sharma, Shubman Gill

Rohit Sharma, Shubman Gill

Indian Batsmen with ODI Double Centuries: వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించడం అంటే మాటలు కాదు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఒక బ్యాటర్ 200 పరుగుల మార్క్‌ను అందుకోవడం అత్యంత అరుదైన ఘనతగా భావిస్తారు. ఇలాంటి అరుదైన మార్క్‌ను క్రికెట్‌లో కొందరే అందుకున్నారు. అందులో ఎక్కువవుగా మనోళ్లే ఉన్నారు. భారత క్రికెట్‌లో ఇప్పటివరకు ఐదుగురు బ్యాటర్లు ఈ రేర్ మార్క్‌ను సాధించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో ఉన్నారు.

సచిన్ టెండూల్కర్.. తొలి భారతీయుడు:

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ చరిత్ర సృష్టించాడు. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 200 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో 200 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి బ్యాటర్‌గా కూడా లిటిల్ మాస్టర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

వీరేంద్ర సెహ్వాగ్.. విధ్వంసం:
2011లో వెస్టిండీస్‌పై వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 149 బంతుల్లో 219 పరుగులు చేసి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో బౌండరీల వర్షం కురిపించిన సెహ్వాగ్.. అప్పట్లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్ శర్మ.. ఏకంగా మూడు డబుల్ సెంచరీలు:
వన్డేల్లో డబుల్ సెంచరీల విషయానికి వస్తే రోహిత్ శర్మ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ మాజీ కెప్టెన్ ఏకంగా మూడు సార్లు 200కు పైగా పరుగులు చేశాడు. 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేసిన రోహిత్.. 2014లో శ్రీలంకపై 264 పరుగులతో వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు నెలకొల్పాడు. 2017లో శ్రీలంకపైనే మరోసారి 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు.

ఇషాన్ కిషన్.. 210 పరుగులు:
2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 210 పరుగులు చేశాడు. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఇషాన్.. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

శుభ్‌మన్ గిల్.. రెండో డబుల్ సెంచరీ:
2023లో న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ 208 పరుగులతో అజేయంగా నిలిచి తన తొలి వన్డే డబుల్ సెంచరీని నమోదు చేశాడు. తాజాగా 2026లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో గిల్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. గువాహటిలో వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ 133 బంతుల్లోనే 223 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో వన్డేల్లో రెండో డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ తర్వాత రెండో భారత బ్యాటర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు.

వన్డేల్లో భారత డబుల్ సెంచరీ హీరోలు:
సచిన్ టెండూల్కర్: 200 vs దక్షిణాఫ్రికా, 2010
వీరేంద్ర సెహ్వాగ్: 219 vs వెస్టిండీస్, 2011
రోహిత్ శర్మ: 209 vs ఆస్ట్రేలియా, 2013; 264 vs శ్రీలంక, 2014; 208 vs శ్రీలంక, 2017
ఇషాన్ కిషన్: 210 vs బంగ్లాదేశ్, 2022
శుభ్‌మన్ గిల్: 208 vs న్యూజిలాండ్, 2023; 223 vs వెస్టిండీస్, 2026.