India Won First T20I Match Against West Indies: మూడే మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన భారత జట్టు.. టీ20ల్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. శుక్రవారం ట్రినిడాడ్ టారౌబాలోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ సేన ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో భారత్ మొదట తడబడినా, ఆ తర్వాత పుంజుకొని భారీ స్కోరు చేయడం.. బౌలర్లు సత్తా చాటడంతో విండీస్‌ని చుట్టేసింది. ఏకంగా 68 పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకోగలిగింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు) అర్థశతకం, దినేశ్ కార్తిక్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా భారత్ 190 పరుగుల మార్క్‌ని అందుకోగలిగింది. రోహిత్‌తో పాటు మ్యాచ్‌ని ఓపెన్ చేసిన సూర్యకుమార్ యాదవ్ (24) ఒక్కడే కాస్త రాణించగా.. మిగిలిన బ్యాట్స్మన్లు నిరాశపరిచారు. ఇక లక్ష్య చేధనకు బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్మన్లలో ఏ ఒక్కరూ బ్యాట్ ఝుళపించలేకపోయారు.
నిజానికి.. టీ20ల్లో విండీస్ ఆటతీరు భిన్నంగా ఉంటుందని అనుకుంటే, అందుకు భిన్నంగా పేలవంగా ఆడింది. 20 పరుగులు చేసిన బ్రూక్స్ ఒక్కడే జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవరూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు, స్ట్రైక్ రొటేట్ చేయలేదు. భారత బౌలర్ల దెబ్బకు, ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. దీంతో.. 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేసి, విండీస్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.