Site icon NTV Telugu

Common Wealth Games 2022: మహిళలు అదరగొట్టారు.. పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం

Smiriti Mandanna

Smiriti Mandanna

Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా నిర్వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్‌లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. 100 కోట్ల మందికి పైగా భారతీయులను సంతోషంలో ముంచెత్తింది. ఆదివారం జరిగిన మహిళల టీ20లో దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో దేశమంతటా సంబరాలు జరుగుతున్నాయి. టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కొడితే సిక్సర్‌ లేదంటే బౌండరీ అన్నట్టుగా బంతిని బాదేసింది.

Read Also: Women: ‘ఆమె’కు వందనం. అవయవదాతల్లో 80 శాతం ఆడవాళ్లే. గ్రహీతల్లో 20 శాతమే. ఎందుకిలా?

అటు మరో ఓపెనర్ షఫాలీ వర్మ 16 పరుగులు చేసి అవుటైంది. ఆమె పెవిలియన్ చేరాక క్రీజులోకి వచ్చిన మేఘన సింగ్ 14 పరుగులు చేసి అవుటైంది. పాకిస్తాన్ బౌలర్లలో తుబా హసన్, ఒమైమా సొహైల్ తలో వికెట్ తీశారు. అంతకుముందు వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ ఓపెనర్ మునీబా అలీ 32 పరుగులు చేసింది. జట్టులో ఆమె టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. అటు వరుసగా రెండో ఓటమితో పాక్ జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. భారత్ అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్ ను ఆగస్టు 3న బార్బడోస్ జట్టుతో ఆడనున్నారు.

Exit mobile version