NTV Telugu Site icon

IND Vs IRE: రాణించిన దీపక్ హుడా, చాహల్.. తొలి టీ20లో టీమిండియా విజయం

Deepak Hooda

Deepak Hooda

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు అంపైర్లు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లుగా దీపక్ హుడా, ఇషాన్ కిషన్ బరిలోకి దిగి ఆశ్చర్యపరిచారు. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో దీపక్‌ హుడా ఓపెనింగ్‌కు వచ్చాడు. దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 47 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. హార్డిక్ పాండ్యా 12 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ మరోసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతడు 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ 2 వికెట్లు పడగొట్టగా లిటిల్ ఒక వికెట్ తీసుకున్నాడు. మూడు ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టిన చాహల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా రెండు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Cricket: చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం