NTV Telugu Site icon

IND Vs IRE: పోరాడి ఓడిన ఐర్లాండ్.. టీమిండియాదే సిరీస్

Deepak Hooda

Deepak Hooda

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసినా పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. చివరకు 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడికి ఓపెనర్ సంజు శాంసన్ సహకారం అందించాడు. శాంసన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు 77 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (3) త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు.

ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్
అయితే టీమిండియా మరింత భారీ స్కోరు చేయాల్సి ఉంది. చివరి మూడు ఓవర్లలో వడివడిగా వికెట్లు కోల్పోవడంతో చివరి ఓవర్లలో తక్కువ పరుగులు చేసింది. ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగారు. దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ ఇలా వచ్చి అలా వెళ్లారు. కెప్టెన్ హార్డిక్ పాండ్యా 9 బంతుల్లో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ ఆదిర్ 3 వికెట్లు పడగొట్టగా జోష్ లిటిల్, యంగ్ రెండేసి వికెట్లు సాధించారు.

అనంతరం 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ 40 పరుగులు, బాల్బర్నీ 60 పరుగులతో రాణించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించారు. హ్యారీ టెక్టర్‌ 39 పరుగులు చేయగా.. చివర్లో జార్జ్‌ డాక్‌రెల్‌ 34 నాటౌట్‌, మార్క్‌ ఎడైర్‌ 23 నాటౌట్‌గా మిగిలారు. ఆఖరి ఓవర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేయడంతో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయడంతో టీమిండియా తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఈ విజయంతో రెండు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దీపక్ హుడాను వరించింది.