NTV Telugu Site icon

IND vs SA: ఖాతా తెరిచిన భారత్.. దక్షిణాఫ్రికాపై ఘనవిజయం

India Won The Match

India Won The Match

ఎట్టకేలకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తన సత్తా చాటింది. ఏ పెర్ఫార్మెన్స్ అయితే ముందు నుంచి కోరుకుంటున్నామో.. అలాంటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై తాండవం చేసి, భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అవును, విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో గెలుపు జెండా ఎగరేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు విధ్వంసకరంగా రాణించడంతో, తొలి 10 ఓవర్లలో భారత్ కేవలం ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేయగలిగింది. ఓపెనర్లైన రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57 పరుగులు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54 పరుగులు)లు అర్థసెంచరీలు సాధించారు. అయితే, రుతురాజ్ ఔటవ్వగానే భారత్ తడబడింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్ళు, పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 31) ఒక్కడే పర్వాలేదనిపిస్తే, మిగిలిన ప్లేయర్స్ సింగిల్ డిజిట్స్‌కే వెనుదిరిగారు. దీంతో.. 200 మైలురాయిని అందుకుంటుందనుకున్న భారత క్రికెట్ జట్టు 179 పరుగులకే పరిమితమైంది.

అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు.. మొదట్నుంచే తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. గత రెండు మ్యాచుల్లో పరుగుల వర్షం కురిపించిన బ్యాట్స్మన్లు సైతం చతికిలపడిపోయారు. క్రీజులో కుదురుకుందామనుకునేలోపే, మన బౌలర్లు తిరిగి వెనక్కి పంపించేశారు. దీంతో.. 131 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. బౌలర్లలో హర్షన్ పటేల్, చాహల్ మెరిశారు. హర్షల్ 3.1 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. చాహల్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. భువి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.