India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!

Asia Cup Winners List

Asia Cup Winners List

Women’s Asia Cup winners List: మహిళల ఆసియా కప్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ ఆసియా కప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ఖాతాలో వేసుకుంది.

2026 ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈ టోర్నీలో తన నాలుగో టీ20 టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. మహిళల టీ20 ఆసియా కప్‌ 2012లో తొలిసారి నిర్వహించగా.. ఆ ఎడిషన్‌లోనే భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2016లోనూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే 2018లో బంగ్లాదేశ్‌ విజేతగా నిలిచి భారత జైత్రయాత్రకు బ్రేక్‌ వేసింది. 2022లో భారత్‌ మళ్లీ టైటిల్‌ను కైవసం చేసుకోగా.. 2024లో శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా 2026లో మరోసారి ట్రోఫీని గెలుచుకున్న భారత మహిళల జట్టు.. టీ20 ఫార్మాట్‌లో నాలుగోసారి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. 2012, 2016, 2022, 2026 ఎడిషన్లలో భారత్‌ టైటిళ్లు సాధించినట్లయింది.

టీ20 ఫార్మాట్‌లోనే కాకుండా వన్డే ఫార్మాట్‌లోనూ భారత్‌ అద్భుతమైన రికార్డును కలిగి ఉంది. మహిళల ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌లో జరిగిన నాలుగు ఎడిషన్లలోనూ టీమిండియానే విజేతగా నిలిచింది. 2004, 2005/06, 2006, 2008లో జరిగిన టోర్నీల్లో భారత్‌ వరుసగా టైటిళ్లను సొంతం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లను కలిపి చూస్తే.. మహిళల ఆసియా కప్‌లో భారత్‌ ఏకంగా ఎనిమిది టైటిళ్లను గెలుచుకుంది. ఈ గణాంకాలు ఆసియా మహిళల క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2026లో మరోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌.. భవిష్యత్‌ టోర్నీల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని చూస్తోంది.