వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ రద్దయ్యింది. తొలుత దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత ఏకధాటిగా పడడంతో మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో.. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ 2-2తో సమం అయ్యింది. తొలి రెండు మ్యాచ్‌లను దక్షిణాఫ్రికా కైవసం చేసుకోగా.. ఆ తర్వాత భారత్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు నమోదు చేసింది.
కాగా.. టాస్ వేయడానికి ముందు నుంచే వాతావరణ పరిస్థితులు తేడా కొట్టాయి. కారుమబ్బులు కమ్ముకోవడంతో, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, అప్పటికీ వర్షం పడకపోవడంతో టాస్ వేశారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో, మ్యాచ్ 50 నిమిషాల ఆలస్యంగా మొదలైంది. నిర్దిష్ట సమయం కంటే మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ అవ్వడంతో.. 19 ఓవర్లకే మ్యాచ్‌ని కుదించారు. పరిస్థితులు బాగుండడంతో భారత్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.
క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు.. భారత్‌కి శుభారంభాన్నే ఇచ్చారు. ఇషాన్ అయితే కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్సులు బాదేశాడు. అయితే.. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఎన్గిడి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఔటమయ్యాడు. దీంతో.. టీమిండియా 3.3 ఓవర్లలో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వరుణుడు మళ్లీ ప్రత్యక్షం కావడంతో ఆట నిలిపివేశారు. వర్షం ఆగని పక్షంలో.. మ్యాచ్‌ని రద్దు చేశారు.