IND vs PAK Final: నేడే భారత్, పాకిస్థాన్ టైటిల్ పోరు.. టీమ్స్, వెన్యూ, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

India Vs Pakistan U19 Final

India Vs Pakistan U19 Final

IND vs PAK Asia Cup 2026 U19 Final: 2026 అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. శనివారం (నవంబర్ 14) ఒమన్‌లోని మస్కట్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాది జట్లలో ఏ టీమ్ విజయం సాధించి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం మరోసారి టైటిల్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉంది.

అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు పాక్:


ఈ టోర్నీలో పాకిస్థాన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలోనే భారత్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరిన ఏకైక జట్టు పాకిస్థానే కావడం విశేషం. మరోవైపు భారత జట్టు కూడా టైటిల్‌పై కన్నేసింది. గత ఎడిషన్‌లోనూ భారత్, పాకిస్థాన్ జట్లే ఫైనల్‌లో తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత యువ ఆటగాళ్లు భావిస్తున్నారు.

సమిష్టి ప్రదర్శన చేయాల్సిందే:
భారత ఆటగాళ్లలో ఆర్యవీర్‌ సెహ్వాగ్, ఇషాన్‌ సూద్‌లు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. టోర్నీలో ఆర్యవీర్‌ ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 101 సగటుతో 303 పరుగులు చేశాడు. ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాన్‌ 11 వికెట్లతో చెలరేగాడు. కెప్టెన్‌ లక్ష్య రాయ్‌చందాని, వికెట్‌కీపర్‌ అన్వయ్‌ ద్రవిడ్, వీకే వినీత్, అర్జున్‌ రాజ్‌పుత్‌ బ్యాటుతో చెలరేగాల్సి ఉంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న దాయాది జట్టును ఆడుకోవాలంటే.. మనోళ్లు సమిష్టిగా రాణించాల్సిందే.

మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?:
భారత్, పాకిస్థాన్ అండర్-19 జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ నేడు జరగనుంది. ఒమన్‌లోని మస్కట్‌లో ఉన్న అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతకంటే అరగంట ముందు.. 10 గంటలకు టాస్ వేయనున్నారు.

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?:
ఫైనల్ మ్యాచ్‌ను భారత క్రికెట్ అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టీవీ లేదా మొబైల్‌లో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

అండర్-19 టీమ్ డీటెయిల్స్:
భారత్: లక్ష్య రాయ్‌చందాని (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, యశ్‌బర్ధన్ చౌహాన్, అర్జున్ రాజ్‌పుత్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ సావసాని, కావ్య పటేల్, ఇషాన్ సూద్, కుషాగ్ర ఓజా, రజత్ బగేల్, షావిన్ వినోద్, యశ్‌వీర్ గౌడ్.
పాకిస్థాన్: ఉస్మాన్ ఖాన్, హయామ్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), అహ్మద్ హుస్సేన్, అలీ రజా, హంజా జహూర్ (వికెట్ కీపర్), హస్నైన్ అబ్బాస్ దార్, మహమ్మద్ సయ్యమ్, రిజ్వానుల్లా, నిఖాబ్ షఫీక్, జహంగీర్ బిలాల్, హుజైఫా అహ్సన్, మహమ్మద్ హుజైఫా, అబ్దుల్ సుబ్హాన్.