India vs Pakistan Match Breaks Old Records Over Viewership: దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరమే! ఆ రెండు దేశాల జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే చాలు.. ప్రతిఒక్కరూ మ్యాచ్ వీక్షించేందుకు టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అందుకే, ఏ మ్యాచ్ లేనంత వ్యూస్ భారత్ x పాక్ మ్యాచ్‌కి వచ్చిపడతాయి. ఈసారి అయితే.. గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేలా భారీ వ్యూస్ వచ్చాయి. డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. ఇవాళ జరిగిన భారత్, పాక మ్యాచ్‌ను ఆ డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఏకంగా 1.80 కోట్ల మంది వీక్షించారు. డిస్నీ+ హాట్‌స్టార్ చరిత్రలో ఈ స్థాయిలో వ్యూస్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌కు 1.30 కోట్ల వ్యూస్ రాగా.. ఈసారి 50 లక్షల వ్యూస్ తేడాతో ఆ రికార్డ్ బద్దలైంది.
కాగా.. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. చివరి బంతి వరకూ ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. విరాట్ కోహ్లీ చివరివరకూ వీరోచితంగా పోరాడి, భారత జట్టుకి మరపురాని విజయాన్ని అందించాడు. తొలుత పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయి, పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. ఒకానొక సమయంలో.. భారత్ ఓటమి తథ్యమని అనుకున్నారు. కానీ.. విరాట్ కోహ్లీ (82), హార్దిక్ పాండ్యా (40) కలిసి మ్యాచ్‌ని మలుపు తిప్పేశారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ.. 113 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఫలితంగా.. టీమిండియా అపురూప విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.