శ్రీలంకతో జరిగిన మొహాలీ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు కెప్టెన్‌గా మొదటి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే భారీ విజయం సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మధురానుభూతిని మిగిల్చింది. అయితే శ్రీలంకపై ఘనవిజయం సాధించినా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు.
డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా వాటిలో 5 విజయాలు, మూడు పరాజయాలు, రెండు డ్రాలు ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక టీమ్‌లతో భారత్ టెస్టులు ఆడింది. తద్వారా 65 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ ఇప్పటి వరకు ఐదు టెస్టులు ఆడగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ఒకటి డ్రా చేసుకుని 52 పాయింట్లు సాధించింది. పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో రెండు మ్యాచ్‌లు గెలిచి, మూడు పరాజయాలు, ఒక డ్రాతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
