శ్రీలంకతో సొంతగడ్డపై నేటి నుంచి టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా లక్నో వేదికగా ఈరోజు రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరమైనా ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రోహిత్ శర్మ సారథ్యంలో ఇటీవల స్వదేశంలో టీమిండియా సిరీస్‌ల మీద సిరీస్‌లు గెలుస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌పైనా భారత్ కన్నేసింది. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ లాంటి ప్రతిభావంతులకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ నిలదొక్కుకోవాలంటే అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో మరో వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు అవకాశమిస్తారో లేదో వేచి చూడాలి. బౌలింగ్ విషయానికి వస్తే ప్రధాన బౌలర్ బుమ్రాతో పాటు భువనేశ్వర్, హర్షల్ పటేల్ పేస్ బాధ్యతలు పంచుకునే అవకాశాలున్నాయి. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, చాహల్ ఆడనున్నారు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించిన రవి బిష్ణోయ్‌ను పక్కన పెడతారా లేదా ఆడిస్తారో చూడాల్సిందే.
