IND Playing 11 vs SL 1st Test in Galle: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15న గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పరంగా ఇరు జట్లకూ ఎంతో కీలకం. దీంతో టీమిండియా విజయం సాధించాలని చూస్తోంది. గాలేలో పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. గాయాల కారణంగా టీమిండియా తుది జట్టులో మార్పులు చోటుచేసుకోనున్నాయి. శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
3వ స్థానంలో పడిక్కల్:
శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ సమస్య నుంచి పూర్తిగా కోలుకోవడం భారత జట్టుకు భారీ ఊరట. ప్రాక్టీస్ మ్యాచ్‌లో చివరి రోజు బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి టెస్టులో గిల్ కెప్టెన్‌గా బరిలోకి దిగడం ఖాయం. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. వైస్ కెప్టెన్ రాహుల్ ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ బాదాడు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో 3వ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడనున్నాడు. గత వారం కొలంబోలో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పడిక్కల్ 142 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 3000 పరుగుల మైలురాయిని పూర్తి చేసేందుకు గిల్ చేరువలో ఉన్నాడు.
సర్ఫరాజ్ vs సారాంశ్:
వికెట్ కీపర్ స్థానంలో రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది. పంత్‌కు అంతర్జాతీయ అనుభవం ఎక్కువగా ఉండటంతో అతడికే ఛాన్స్ దక్కనుంది. ఆరో స్థానాల్లో దేశవాళీల్లో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సారాంశ్ జైన్ కూడా పోటీలో ఉన్నా.. సర్ఫరాజ్ ప్లేయింగ్ 11లో ఉండనున్నాడు. 7లో రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా ఖాయం. గాలే పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి.. బౌలింగ్ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్‌లు ఆడనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే సుతార్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ప్రసిద్ధ్, గుర్నూర్ మధ్య పోటీ:
జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ బాధ్యత తీసుకోనున్నాడు. సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని ఎవరు పంచుకోనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ మధ్య పోటీ నెలకొంది. అనుభవం పరంగా చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ ముందంజలో ఉన్నాడు. అయితే వార్మప్ మ్యాచ్‌లో గుర్నూర్ చూపిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. అదనపు వేగం, బౌన్స్‌తో శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన గుర్నూర్.. ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి కెప్టెన్ గిల్ ఎలాంటి ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతాడో.
గాలే టెస్టుకు భారత్ జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్/సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్/ప్రసిద్ధ్ కృష్ణ.

