Site icon NTV Telugu

Asia Cup 2022: అభిమానులు బీ రెడీ.. రేపటి నుంచే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు

Asia Cup Match

Asia Cup Match

Asia Cup 2022: ఈనెల 27 నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత దాయాది దేశాలు ఇప్పటివరకు తలపడలేదు. దీంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల తేదీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇటీవల ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆగస్టు 15 నుంచి ఆసియా కప్ మ్యాచుల టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ఏసీసీ తెలియజేసింది.

Read Also: Shocking Video: పాముపై కాలేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?

ఇప్పటికే ఆసియా కప్‌ కోసం భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ ఈ టోర్నీకి అర్హత సాధించగా.. యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్‌ జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంది. వీటిలో ఓ జట్టు ఆసియా కప్ టోర్నీకి 6వ జట్టుగా ఎంపికవుతుంది. ఈ బెర్త్ కోసం ముఖ్యంగా యూఏఈ, హాంకాంగ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఆసియాకప్ ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే శ్రీలంకలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆహార కొరత కారణంగా ఈ టోర్నమెంట్‌ను యూఏఈకి మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. కాగా ప్రస్తుతం టీమిండియా జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. అటు పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్ జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది.

Exit mobile version