తొలి వన్డేలో అద్భుతమైన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. బ్యాట్స్మన్లు పూర్తిగా చేతులెత్తేయడంతో, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఓపెనర్లు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, మిడిలార్డర్ బ్యాట్స్మన్లు కూడా రాణించకపోవడంతో.. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫస్ట్ వన్డేలో బుమ్రా తరహాలో రెండో వన్డేలో ప్రత్యర్థి బౌలర్ టాప్లీ భారత్‌ని దెబ్బ తీశాడు. ఆరు వికెట్లతో కొరడా ఝుళిపించాడు. దీంతో.. ఈ వన్డే సిరీస్ 1-1 తో సమం అయ్యింది.
లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ చేసేందుకు ఇంగ్లండ్ రంగంలోకి దిగింది. తొలుత ఓపెనర్లు ఆచితూచి రాణించారు. 41 పరుగుల వరకూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, తొలి వికెట్ పడ్డాక ఇంగ్లండ్ తడబడింది. భారత బౌలర్లు చుక్కలు చూపించడంతో.. 102 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తద్వారా మళ్లీ తక్కువ స్కోరుకే ఇంగ్లండ్ ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. మోయిన్ అలీ (47), డేవిడ్ విల్లీ(41) బాగా రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 49 ఓవర్లలో 246 పరుగులు చేసి, ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యం ఏమంత పెద్దది కాదు కాబట్టి.. భారత్ ఈజీగానే ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ, ఇంగ్లండ్ బౌలర్లు ఆ అంచనాల్ని తిప్పికొట్టారు. భారత ఆటగాళ్లకు ఆడే అవకాశమే ఇవ్వలేదు. ప్రధాన బ్యాట్స్మన్లందరూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. నిజానికి.. కోహ్లీ మూడు చక్కని ఫోర్లు కొట్టడం, కాస్త ఊపుమీద ఉన్నట్టు కనిపించడంతో.. ఈ వన్డేలో తప్పకుండా దుమ్ముదులుపుతాయని ఆశించారు. ఇంతలోనే ఆ ఆశల్ని ఆవిరి చేస్తూ.. 16 పరుగులకే వెను దిరిగాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో.. తొలి వన్డేలో ఇంగ్లండ్ సీన్ రివర్స్ అవుతున్నట్టు అనిపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఆ పతనాన్ని అడ్డుకున్నారు.
హార్దిక్ పాండ్యా(29), సూర్యకుమార్ యాదవ్(27), రవీంద్రా జడేజా(29), మహమ్మద్ షమీ(23) కాసేపు పోరాడారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని, భారత్ జట్టుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు. కానీ.. అది కూడా ఏమాత్రం సరిపోలేదు. చివర్లో ఆరు పరుగుల తేడాతో భారత్ వరుసగా నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దెబ్బకు 146 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ ఆరు వికెట్లతో మెరిశాడు. డేవిడ్ విలీ, బ్రైడన్ కార్స్, మోయిన్ అలీ, లివింగ్టన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.
