NTV Telugu Site icon

India World Record: పాక్‌పై విజయంతో.. ఆ వరల్డ్ రికార్డ్ బద్దలుకొట్టిన భారత్

India World Record

India World Record

India Creates World Record After Beating Pakistan: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. నిన్న పాకిస్తాన్‌పై భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే! చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో.. నాలుగు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఓపెనర్లు చేతులు ఎత్తేయడంతో.. హార్దిక్ పాండ్యా(40) సహకారంతో విరాట్ కోహ్లీ(82) వీరోచితంగా పోరాడి, భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ ఒక వరల్డ్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా.. అగ్రస్థానంలో నిలిచింది.

ఇప్పటివరకూ ఆస్ట్రేలియా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో కొనసాగింది. 2003లో ఆసీస్ జట్టు.. అన్ని ఫార్మాట్లలో కలిపి 47 మ్యాచ్‌లు ఆడగా, 38 విజయాలు సాధించింది. ఇన్ని సంవత్సరాల వరకు నిలకడగా ఉన్న ఈ రికార్డ్‌ని, ఈ ఏడాదిలో భారత్ బద్దలు కొట్టింది. ఈ ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 56 మ్యాచ్‌లు ఆడిన భారత్.. టీ20ల్లో 24, టెస్టుల్లో 2, వన్డేల్లో 13 మ్యాచ్‌లు కలిపి 39 విజయాలు సాధించింది. ఈ ఏడాదిలో భారత్ ఇంకా 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంటే.. విజయాల సంఖ్య మరింత పెరగనుందన్నమాట! ఈ లెక్కన.. భారత్ తన ఖాతాలో తిరుగులేని ఘనతని నమోదు చేసుకోబోతోంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత్.. మొదట్లో తడబడినప్పటికీ విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Show comments