Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!

India 200 T20i Wins

India 200 T20i Wins

Team India First Team to Win 200 T20I Matches: టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ మరో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 200 విజయాలు సాధించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో అద్భుత విజయం సాధించిన భారత్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండొందల విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ భారత్‌కు 300వ టీ20 మ్యాచ్ కావడం విశేషం.

భారత్ ఇప్పటివరకు 300 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 200 విజయాలు సాధించింది. 83 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. మరో ఏడు మ్యాచ్‌లు టైగా ముగియగా.. 10 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 200 విజయాల మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో పాకిస్థాన్ 176 విజయాలతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 135, దక్షిణాఫ్రికా 129, ఇంగ్లండ్ 128, ఆస్ట్రేలియా 127 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీ20ల్లో భారత్ ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఈ సంఖ్య మరింత పెరగనుంది.

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే తెలుగు ప్లేయర్స్ తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. తిలక్ 26 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలవగా.. నితీశ్ కేవలం 13 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. చివరి వరకు పోరాడిన భారత జట్టు 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.