NTV Telugu Site icon

INDvsNZ ODI: కదంతొక్కిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ 108 ఆలౌట్

India

India

రాయ్‌పూర్ వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్ములేపారు. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మన బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయారు. కలిసికట్టుగా ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు. దీంతో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ 34.3 ఓవర్లలో 108 రన్స్‌కే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో షమీ (3), పాండ్యా (2), సుందర్ (2) వికెట్లతో ఆకట్టుకోగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికే ఫిన్ అలెన్ (0)ను ఔట్ చేసి న్యూజిలాండ్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు షమీ. అనంతరం సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో హెన్రీ నికోలస్ (2), హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం డారైల్ మిచైల్ (1), టామ్ లాథమ్ (1), కాన్వే (7) వికెట్లు కోల్పోయిన కివీస్‌ 10 ఓవర్లలో 15 5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం ఫిలిప్స్‌తో కలిసి బ్రేస్‌వెల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ 19వ ఓవర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షమీ మొదటి వన్డేలో వీరోచితంగా పోరాడిన బ్రేస్‌వెల్ (22) వికెట్ తీసి టీమిండియా శిబిరంలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. దీంతో కివీస్ స్కోర్ 100 దాటడమే కష్టంగా కనిపించింది. అయితే ఫిలిప్స్‌తో జతకలిసిన శాంట్నర్ భారత బౌలర్లను కాసేపు కాచుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 47 రన్స్ జోడించి స్కోర్‌ను 100 దాటించారు. కాగా కాసేపటికే శాంట్నర్ (27)ను పాండ్యా బౌల్డ్ చేశాడు. అనంతరం ఫిలిప్స్ (36)ను సుందర్ పెవిలియన్ పంపగా.. ఫెర్గుసన్ (1), టిక్నెర్ (2), త్వరత్వరగా ఔట్ కావడంతో కివీస్ 108 రన్స్‌కు ఆలౌటైంది.