Site icon NTV Telugu

IND vs SA 2nd Test: భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే.. మెయిన్ రీజన్ గంభీర్!

Team India Batting Trolls

Team India Batting Trolls

గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 140 పరుగులకు ఆలౌటై.. 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీస పోరాటం సి కూడా చేయలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ చెలరేగిన అదే పిచ్‌పై భారత్ బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా టాప్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఈ ఓటమితో సిరీస్‌ను 2-0తో భారత్ కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌పై దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌ నెగ్గింది. ఈ టెస్ట్ ఓటమికి ఐదు ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం.

పేలవ బ్యాటింగ్:
ఓటమికి అతిపెద్ద కారణం బ్యాటింగ్. దక్షిణాఫ్రికా టెయిలెండర్లు గంటల తరబడి క్రీజులో ఉండగా.. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజాలతో కూడిన టాప్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. రెండు ఇన్నింగ్స్‌లలో ఇదే తీరు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. చాలామంది బాధ్యతారహితంగా ఆడారు. షాట్ ఎంపికలో కూడా నిరాశపరిచారు. 7వ నంబర్ బ్యాటర్ ముత్తుసామి (106), 9వ స్థానంలో ఆడిన జాన్సెన్ (93) పోరాట ఇన్నింగ్స్‌లు ఆడగా.. భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. పేలవమైన బ్యాటింగ్ మనల్ని నిండా ముంచింది.

పసలేని బౌలింగ్:
బ్యాట్స్‌మెన్ లాగే బౌలర్లు కూడా ఓటమికి కారణం. మొదటి రెండు రోజులు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లను ఆటాడుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ నుంచి బౌలర్లకు ఎటువంటి సహాయం అందడం లేదని అనిపించింది. కానీ భారత్ ఇన్నింగ్స్‌లో ఆఫ్రికన్ బౌలర్లు వికెట్లు తీశారు. మార్కో జాన్సెన్ (6 వికెట్లు) బౌన్సర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగా.. రెండవ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సైమన్ హార్మర్ ఆధిపత్యం చెలాయించాడు. భారత పేసర్లు మాత్రమే కాదు స్పిన్నర్లు కూడా తేలిపోయారు. కుల్దీప్, జడేజా వికెట్లు తీసుకున్నప్పటికీ.. సరైన సమయంలో తీయలేదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పేలవమైన బౌలింగ్ ఈ మ్యాచ్‌లో ఓటమికి కారణం.

Also Read: T20 World Cup 2026: భారత్‌ ఫైనల్స్‌కు వెళ్తుంది.. రోహిత్ శర్మ జోస్యం!

రిషబ్ పంత్ కెప్టెన్సీ:
రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో విఫలమవడమే కాకుండా.. కెప్టెన్సీ కూడా ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్‌లో పంత్ కెప్టెన్సీ విమర్శలకు గురైంది. గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ సిరీస్‌కు దూరమైన తర్వాత అతడికి బాధ్యత అప్పగించబడింది. పంత్ తీసుకున్న చాలా నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొదటి ఇన్నింగ్స్‌లో నితీష్ రెడ్డితో ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాడు. పంత్ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత దినేష్ కార్తీక్ ప్రశ్నించారు.

దక్షిణాఫ్రికాను తేలికగా తీసుకోవడం:
దక్షిణాఫ్రికాను తేలికగా తీసుకోవడమే ఓటమికి మరో కారణం. బుమ్రా మొదటి టెస్ట్‌లో ప్రత్యర్థి కెప్టెన్ టెంబా బావుమాను ‘మరుగుజ్జు’ అని పిలవడంతో సఫారీలు సీరియస్ గా తీసుకున్నారు. ఏ క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోలేని ఓటమి ఇది. రెండవ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ టెస్ట్ ఫార్మాట్‌లో ఛాంపియన్‌ ఎందుకు అయిందో వెల్లడించింది. దక్షిణాఫ్రికా 25 సంవత్సరాల తర్వాత భారతదేశంలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.

గంభీర్ కోచింగ్‌:
గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో భారత్ సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఓడిపోవడం ఇది రెండోసారి. ఇది గంభీర్ కోచింగ్‌పై ప్రశ్నలను లేవనెత్తింది. ప్రధాన కోచ్‌గా నియమితులైన కొన్ని నెలల్లోనే ముగ్గురు భారత దిగ్గజాలు ఒకరి తర్వాత ఒకరు వీడ్కోలు పలికారు. విరాట్, రోహిత్ వీడుకోలుకు ప్రధాన కారణం గౌతీనే అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కుర్రాళ్లను నమ్మిన గౌతీ.. టీమిండియాను నట్టేట ముంచేశాడు. గంభీర్ రాజకీయాలు కూడా భారత్ ఓటమికి కారణం అని నెటిజెన్స్ అంటున్నారు.

Exit mobile version