IND vs PAK T20 World Cup Stats: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాలు అంటే.. దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లే. ముఖ్యంగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఈ రెండు జట్లు తలపడితే.. ఆ క్రేజే వేరు. ఇండో-పాక్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను ఇస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎన్నో సంవత్సరాలుగా దాయాదుల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ.. గణాంకాల పరంగా భారత్ స్పష్టమైన ఆధిపత్యం చూపిస్తోంది. 1992-2025 మధ్య వన్డే, టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో భారత్-పాకిస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.
వరల్డ్‌కప్‌ల్లో భారత్ దూకుడు:
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లను కలిపి చూస్తే.. ఇప్పటివరకుభారత్, పాకిస్థాన్ జట్లు మొత్తం 16 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ ఏకంగా 15 మ్యాచ్‌లు గెలుచుకుని అద్భుత రికార్డు నెలకొల్పింది. పాక్ మాత్రం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలు ఇండో–పాక్ వరల్డ్‌కప్ చరిత్రలో భారత జట్టు ఎంత ప్రభావవంతంగా ఆడిందో స్పష్టంగా చెబుతోంది.
చారిత్రాత్మక విజయాల జాబితా:
1992లో ప్రారంభమైన పోరులో భారత్ వరుసగా పలు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 1992, 1996, 1999 వరల్డ్‌కప్‌ల్లో పరుగుల తేడాతో గెలిచిన భారత్.. 2003లో వికెట్ల తేడాతో గెలిచి ఆధిపత్యం కొనసాగించింది. 2007లో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో కూడా భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2011, 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌ల్లో కూడా భారత్ వరుస విజయాలు నమోదు చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ల్లో కూడా భారత్ ఆధిపత్యం కొనసాగింది. 2012, 2016, 2022, 2024, 2025 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాలు నమోదు చేసింది. అయితే 2021లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలిచి.. ఏకైక విజయం నమోదు చేసింది. అదే పాక్ చరిత్రాత్మక విజయం.
Also Read: IND vs PAK: పాకిస్థాన్ అంటేనే ఊగిపోతున్న హార్దిక్ పాండ్యా.. గణాంకాలు చూస్తే మతి పోవాల్సిందే!
గణాంకాల్లో స్పష్టమైన తేడా:
మొత్తం మ్యాచ్‌ల్లో భారత్ 15 విజయాలు, పాకిస్థాన్ 1 విజయం సాధించింది. ఈ రికార్డు చూస్తే వరల్డ్‌కప్‌ల్లో భారత్ ఎంత స్థిరంగా, ఒత్తిడిని తట్టుకుని ఆడుతుందో ఇట్టే అర్ధమవుతోంది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనలు చేయడం ఈ ఆధిపత్యానికి ప్రధాన కారణం అని చెప్పాలి.
2026 మ్యాచ్‌పై ఆసక్తి:
ఇప్పుడు అభిమానుల దృష్టి 2026 పోరుపై నిలిచింది. ఈసారి పాకిస్థాన్ గత ఫలితాలను మార్చగలదా? లేక భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇండియా–పాక్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు.. అది భావోద్వేగాలు, గర్వం, చరిత్ర కలిసిన మహా సమరం. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ జట్లు కొలంబో వేదికగా తలపడనున్నాయి.
