IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!

Vaibhav Sooryavanshi Post

Vaibhav Sooryavanshi Post

Vaibhav Sooryavanshi Instagram Post: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత యువ జట్టు ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగేలా సాగిన ఈ పోరులో భారత్ అద్భుతంగా పుంజుకుని టైటిల్‌ను సొంతం చేసుకుంది. గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఉత్కంఠభరిత విజయంపై భారత క్రికెట్ అభిమానులతో పాటు యువ క్రికెటర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చేసిన సోషల్ మీడియా పోస్టులు ఆసక్తికరంగా మారాయి.

భారత్ విజయం సాధించిన వెంటనే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా అసుకొచ్చాడు. ‘కంగ్రాచ్యులేషన్స్.. ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’ అంటూ భారత జట్టు విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను చూసి తాను కూడా సాధారణ క్రికెట్ అభిమాని లాగే ఉత్సాహానికి గురయ్యానని అతడి పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆర్యవీర్‌ను ‘స్టార్ బాయ్’ అంటూ ప్రశంసించాడు. ఈ టోర్నీలో ఆర్యవీర్ మొత్తం 361 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లోనూ అతడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 61 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

మ్యాచ్ అనంతరం భారీ లక్ష్య ఛేదనకు భారత జట్టు ఎలా సిద్ధమైందో ఆర్యవీర్ వెల్లడించాడు. పాకిస్థాన్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యం తమకు మరీ పెద్దదిగా అనిపించలేదని చెప్పాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, సాధారణంగా ఆడుతూ తమ సహజమైన షాట్లు ఆడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే నమ్మకం జట్టులో ఉందని వివరించాడు. అందుకే ఛేదన సమయంలో ఆట ప్రణాళికను మార్చుకోవాలనే చర్చ జరగలేదని తెలిపాడు. చివరి 10 ఓవర్లలో 100 నుంచి 120 పరుగులు చేయాల్సి వచ్చినా ఛేదించే సామర్థ్యం తమకు ఉందని జట్టు సమావేశాల్లో చర్చించుకున్నట్లు చెప్పాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఒక బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉండటం అవసరమని, కెప్టెన్ లక్ష్య రైచందాని ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడని ప్రశంసించాడు. చివర్లో మోహిత్ ఉల్వా, మనాల్ చౌహాన్ చేసిన పోరాటం అద్భుతమని ఆర్యవీర్ కొనియాడాడు.