Site icon NTV Telugu

IND vs NZ 4th T20: నేడు విశాఖలో నాలుగో టీ20.. సంజు శాంసన్‌ సంగతి ఏంటి?

Sanju Samson

Sanju Samson

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది. హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళుతున్న భారత్‌.. నేడు నాలుగో టీ20కి సిద్ధమైంది. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు మంచి రికార్డు ఉన్న విశాఖలో మ్యాచ్‌ జరగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2026 ముందు భారత బ్యాటర్లు చెలరేగుతుండడం సానుకూలాంశం. అయితే ఓపెనర్‌ సంజు శాంసన్‌ ఫామ్ మాత్రం జట్టుకు ఆందోళనకరంగా మారింది. సంజుకు నాలుగో టీ20 చివరి అవకాశం అని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‌లోనూ సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అందుకే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అతడికి అవకాశం ఇచ్చింది. టీ20 సిరీస్‌లో మాత్రం వరుసగా 10, 6, 0 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాగా ఆడినా అవకాశం ఇవ్వట్లేదని గతంలో చాలాసార్లు చెప్పిన సంజు.. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే మాత్రం విఫలమవుతున్నాడు. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ పునరాగమనంలో చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో సంజు ఈ రెండు మ్యాచ్‌లలో ఆడకపోతే.. ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా కిషన్‌ ఆడుతాడు. ఇప్పటికే ఓపెనర్‌గా కిషన్‌ను ఆడించాలని సోషల్ మీడియాలో ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. జట్టులో తిలక్ వర్మ లేడు కాబట్టి సంజు నేటి మ్యాచ్‌లో ఆడనున్నాడు.

మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఫుల్ ఫామ్ మీదున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థి బ్యాటర్లకు సింహ స్వప్నంలా మారాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా మెరుపు అర్ధ సెంచరీలతో ఫామ్ అందుకున్నాడు. హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, రింకు సింగ్‌లు బాదడానికి సిద్ధంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ ముందు జస్ప్రీత్ బుమ్రా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. హర్షిత్‌ రాణా కూడా రాణిస్తున్నాడు. రవి బిష్ణోయ్‌, కుల్దీప్ యాదవ్ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.

మూడు మ్యాచ్‌లలో తేలిపోయిన కివీస్ నాలుగో టీ20 అయినా గెలవాలని చూస్తోంది. కాన్వే, సీఫర్ట్, రచిన్‌ రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఫిలిప్స్, మిచెల్, చాప్‌మన్, శాంట్నర్‌లతో మిడిలార్డర్‌ బాగానే ఉంది. పేసర్ హెన్రీ రాణిస్తున్నాడు. స్పిన్నర్లు శాంట్నర్, ఇష్‌ సోధి ప్రభావం చూపట్లేదు. స్పిన్‌కు అనుకూలించే విశాఖ పిచ్‌పై వేరు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. విశాఖ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. 200లకు పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారీ లక్ష్యాలు కూడా ఛేదించొచ్చు. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ను ఎంచుకునే అవకాశాలున్నాయి. విశాఖలో భారత్‌ నాలుగు టీ20లు ఆడితే.. మూడు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడింది.

 

 

Exit mobile version