Matt Henry Three Wickets: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో 334 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముగ్గురూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ ఒకే ఓవర్‌లో ఈ ముగ్గురినీ ఔట్ చేసి భారత శిబిరంలో కలకలం రేపాడు.
భారత ఇన్నింగ్స్ తొలి బంతికే రోహిత్ శర్మ (0) ఔటయ్యాడు. మాట్ హెన్రీ వేసిన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బంతిని ఆడబోయిన రోహిత్.. స్లిప్‌లో ఉన్న ఫిన్ అలెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఐదో బంతికి విరాట్ కోహ్లీని హెన్రీ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక ఓవర్ చివరి బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు పడింది.
ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక బ్యాటర్లు డకౌట్ కావడంతో భారత అభిమానులు షాక్‌కు గురయ్యారు. భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన తరుణంలో టాప్ ఆర్డర్ ఇలా కుప్పకూలడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిస్థితుల్లో భారత్ ఆశలన్నీ రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌పైనే ఉన్నాయి. వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌ను గాడిలో పెడతారా?, 334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా భారత్ పుంజుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

