Site icon NTV Telugu

IND Vs NZ: నేడు న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. నితీష్-ప్రసిధ్‌ అవుట్, భారత్‌ ప్లేయింగ్ XI ఇదే!

Ind Playing 11

Ind Playing 11

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య చివరి మ్యాచ్ నేడు జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలి వన్డేలో భారత్‌ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ విజయాన్ని అందుకుంది. స్వదేశంలో మరో సిరీస్‌ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత్ ఉండగా.. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ సాధించాలని కివీస్‌ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో చివరి వన్డే ఆసక్తికరంగా సాగవచ్చు.

రెండో వన్డేలో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ పెద్ద ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌ జట్టుకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్‌ సత్తాచాటాల్సి ఉంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ ఆయుష్‌ బదోని జట్టులోకి రావొచ్చు. బదోని అరంగేట్రం దాదాపుగా ఖరారు అయినట్లే తెలుస్తోంది. పేసర్ ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలో ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఆడించే అవకాశముంది.

రెండో వన్డేలో విజయంతో న్యూజిలాండ్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన డారిల్ మిచెల్‌.. మరోసారి జట్టును ఆదుకోనున్నాడు. డెవాన్ కాన్వే కూడా మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి సత్తా చాటాలని కివీస్ జట్టు కోరుకుంటోంది. కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ మిడిలార్డర్‌లో కీలకం కానున్నారు. పేసర్‌ జేమీసన్‌ భారత్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. క్లార్క్, ఫోక్స్‌లతో బౌలింగ్‌ బాగానే ఉంది. లెనాక్స్‌ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌కు చోటు దక్కనుంది. కివీస్ జట్టులో 8 మంది తొలిసారి భారత గడ్డపై ఆడుతున్నా.. గట్టి పోటీ ఇస్తున్నారు. సిరీస్‌ గెలిస్తే న్యూజిలాండ్‌కు ఇది పెద్ద ఘనత అవుతుంది.

తుది జట్లు (అంచనా):
భారత్‌: శుభ్‌మన్‌ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, లోకేష్ రాహుల్, నితీశ్‌ రెడ్డి/ఆయుష్‌ బదోని, ఆర్ జడేజా, హర్షిత్‌ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్, మహమ్మద్ సిరాజ్‌.
న్యూజిలాండ్‌: కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, మైకెల్‌ హే, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, క్రిస్టియన్‌ క్లార్క్, జేమీసన్, ఫౌక్స్, లెనాక్స్‌.

 

 

Exit mobile version