IND Playing 11 vs NZ 2nd Test: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టుకు టీమిండియా తుది జట్టులో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. యువ ఫాస్ట్ బౌలర్ గూర్నూర్ బ్రార్‌కు టెస్టు అరంగేట్రం చేసే ఛాన్సెస్ మెండుగా అనంట్లు తెలుస్తోంది. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ పిచ్ పరిస్థితులకు గూర్నూర్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఒకరిపై వేటు:
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గూర్నూర్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి వేగం, బౌన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్.. ‘భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి గూర్నూర్ గురించి ఎంతో ఆసక్తి నెలకొంది. అతడి వేగం, బౌన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడి పరిస్థితులకు అతడు చక్కగా సరిపోతాడని భావిస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం’ అని చెప్పాడు. గూర్నూర్ జట్టులోకి వస్తే.. అన్షుల్ కంబోజ్ లేదా ప్రసిధ్ కృష్ణలలో ఒకరిపై వేటు పడనుంది.
సరైన మార్గంలోనే ఉన్నాడు:
గూర్నూర్ బ్రార్ టెస్టు జట్టులో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడని మోర్కెల్ తెలిపాడు. ‘గూర్నూర్ టెస్టు జట్టులోకి వచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని విషయాల్లోనూ సరైన మార్గంలోనే వెళ్తున్నాడు. అయితే ఆటగాడిగా తుది జట్టు ఎంపిక మన చేతుల్లో ఉండదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేలా సిద్ధంగా ఉండాలి. అరంగేట్రానికి దగ్గరగా ఉన్నప్పుడు కొంతమంది బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. అతడికి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కానీ ఆ సమయానికి అతడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండేలా చూడటం నా బాధ్యత’ అని వివరించాడు.
పిచ్‌పై ఎక్కువ పచ్చిక ఉంది:
రెండో టెస్టు జరగనున్న హ్యాగ్లీ ఓవల్ పిచ్‌పై కూడా మోర్కెల్ స్పందించాడు. మైదానంలో పిచ్‌పై ఎక్కువ మొత్తంలో పచ్చిక కనిపిస్తోందని, అయితే అది మ్యాచ్‌లో ఎలా స్పందిస్తుందో చూడాలని తెలిపాడు. ‘నేను చూసినంతవరకు పిచ్‌పై ఎక్కువ పచ్చిక ఉంది. గత మ్యాచ్‌కు ముందు కూడా పిచ్‌పై మంచి బౌన్స్, వేగం ఉంటాయని భావించాం. కానీ మ్యాచ్‌లో పరిస్థితులు అలా లేవు. కాబట్టి పిచ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడే చెప్పలేం. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎదురయ్యే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటమే ముఖ్యం’ అని పేర్కొన్నాడు.
అంచనా వేయడం సరికాదు:
యువ పేసర్ అన్షుల్ కంబోజ్ ప్రదర్శనపైనా మోర్కెల్ స్పందించాడు. గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన కంబోజ్.. తొలి మ్యాచ్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి 89 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టులో కొత్త బంతితో వికెట్ సాధించడంతో పాటు నైట్‌వాచ్‌మన్‌గా 38 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే తొలి టెస్టు ప్రదర్శన ఆధారంగా కంబోజ్‌ను అంచనా వేయకూడదని మోర్కెల్ సూచించాడు. ‘అది కేవలం అన్షుల్ విషయంలోనే కాదు. న్యూజిలాండ్ బౌలర్లు కూడా ఆ పిచ్‌పై తక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఒక ఆటగాడిని అతడి తొలి టెస్టుతోనే అంచనా వేయడం సరికాదు. తొలి మ్యాచ్ ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. జట్టు కోసం కఠిన ఓవర్లు వేస్తున్న అతడికి మనం మద్దతుగా నిలవాలి. రెండు మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతడి ప్రదర్శనపై చర్చించవచ్చు. ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుంది’ అని స్పష్టం చేశాడు.
రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, అన్షూల్ కాంబోజ్, ప్రసిధ్ కృష్ణ/గుర్నూర్ బ్రార్.

