Shubman Gill on IND vs NZ 1st Test Draw: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలగా ఆడటంతో.. భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయలేకపోయారు. డారిల్ మిచెల్ (49: 186 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ (26: 126 బంతుల్లో) గట్టిగా పోరాడారు. ఈ ఇద్దరు 43 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి.. ఆరో వికెట్‌కు కేవలం 63 పరుగులే చేశారు. దీంతో చివరి రోజు ఫలితం తేలేలా కనిపించకపోవడంతో.. మరో 16 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను డ్రా చేసుకొనేందుకు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 368 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 720/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 120 ఓవర్లలో 239/5 స్కోరు చేసింది.
ఆట సూపర్:
ఈ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. చివరి రోజు భారత బౌలర్లు వికెట్లు తీయడానికి ప్రయత్నించినప్పటికీ.. కివీస్ బ్యాటర్లు అడ్డుగోడలా నిలిచారన్నారు. అయితే పిచ్‌పై పది వికెట్లు తీయడం అంత సులభం కాదని ముందే ఊహించామని తెలిపాడు. తమకు కొన్ని అవకాశాలు లభించినప్పటికీ.. టెయిలెండర్ల విషయంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేమని పేర్కొన్నాడు. మొత్తంగా ఫీల్డింగ్‌లో తమ ప్రదర్శన బాగానే ఉందని అభిప్రాయపడ్డాడు. తదుపరి టెస్ట్ మ్యాచ్ కోసం బౌలర్లను ఫ్రెష్‌గా ఉంచేందుకే డ్రాకు అంగీకరించా అని గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
పది వికెట్లు తీయడం సవాలే:
‘కఠినమైన రోజుగా భావించడం లేదు. ఈ పిచ్‌పై పది వికెట్లు తీయడం సవాలుతో కూడుకున్న పని అని మాకు ముందే తెలుసు. అయినప్పటికీ మాకు కొన్ని అవకాశాలు లభించాయి. ముఖ్యంగా టెయిలెండర్ల విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అక్కడక్కడా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ.. మొత్తంగా మైదానంలో మా ప్రదర్శన బాగానే ఉంది. మేం చాలా బాగా ఆడాం. ప్రత్యర్థి సొంతగడ్డపై పర్యటిస్తూ అన్ని విభాగాల్లోనూ వారికి గట్టి పోటీ ఇచ్చాం. మాకు అదే చాలా ముఖ్యం. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసినప్పుడు కూడా బాగానే రాణించాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లో జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారు. కేవలం ఇద్దరు మాత్రమే సెంచరీలు చేసినప్పటికీ.. మేం 700 పరుగులు సాధించాం. ఇది చాలా గొప్ప విషయం’ అని గిల్ చెప్పాడు.
బౌలర్లను ఫ్రెష్‌గా ఉంచేందుకే:
‘క్రైస్ట్‌చర్చ్‌లో తదుపరి టెస్టుకు ముందు మూడున్నర రోజుల సమయం ఉంది. ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. క్రైస్ట్‌చర్చ్‌లోని పిచ్‌పై బౌలర్లకు మరికొంత సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఇక్కడ ఆడిన తరహాలోనే అక్కడ కూడా ఆడి.. బ్యాటింగ్, బౌలింగ్‌లో మా ప్రణాళికలను అమలు చేయగలిగితే విజయం సాధిస్తామని భావిస్తున్నాను. పిచ్‌పై బౌలర్లకు మరికొంత సహకారం లభించి ఉంటే బహుశా మ్యాచ్‌ను కొనసాగించే అవకాశం ఉండేది. కానీ మా ఫాస్ట్ బౌలర్లు బాగా అలసిపోయారు. ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌లో దాదాపు 50 ఓవర్లు బౌలింగ్ చేశారు. అంతేకాకుండా రేపు ప్రయాణం కూడా ఉంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందుకే మా బౌలర్లందరినీ తాజాగా ఉంచాలని అనుకున్నాం. మరో ఐదు నుంచి పది ఓవర్లు బౌలింగ్ చేసినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే డ్రాకు అంగీకరించా’ అని గిల్ స్పష్టం చేశాడు.

