Site icon NTV Telugu

T20 World Cup: ఐసీసీ కీలక నిర్ణయం.. కరోనా వచ్చినా మ్యాచ్ ఆడొచ్చు..!!

International Cricket Council

International Cricket Council

T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే పసికూన నమీబియా సంచలనం నమోదు చేసింది. శ్రీలంకపై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రస్తుతం కరోనా కూడా మెగా టోర్నీకి గుబులు పుట్టిస్తోంది. కరోనా సోకిన ఆటగాడు దూరమైతే పలు జట్లు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది. టోర్నీ సమయంలో ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్ తప్పనిసరి కాదని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ఆటగాడి ఆరోగ్య పరిస్థితిని బట్టి మ్యాచ్ ఆడాలో, వద్దో నిర్ణయించుకునే అవకాశాన్ని జట్టుకే వదిలివేస్తున్నట్లు ఐసీసీ వివరించింది.

Read Also: Iran Protests : హిజాబ్‌పై గర్జిస్తున్న ఇరాన్ మహిళలు.. మతపెద్దలు వెళ్లిపోవాలంటూ డిమాండ్

అయితే కరోనా వచ్చిన ఆటగాళ్లకు మ్యాచ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం ఐసీసీకి ఇదేమీ కొత్త కాదు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ సమయంలో కరోనా వచ్చిన మహిళా ఆటగాళ్లకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినప్పటికీ ఆడేందుకు ఐసీసీ అంగీకారం తెలిపింది. అయితే ఆమె మాస్క్‌ ధరించి జట్టు నుంచి దూరంగా కూర్చుంది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఆమె జట్టు సభ్యులతో కలిసి సంబరాలు చేసుకుంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని… టీకాల ద్వారా కరోనా నుంచి ఏర్పడే ముప్పును ధైర్యంగా ఎదుర్కొంటున్నారని.. ఈ మేరకు కరోనా వచ్చిన ఆటగాళ్లను దూరంగా ఉంచకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ అభిప్రాయపడింది.

Exit mobile version