NTV Telugu Site icon

టీమిండియాకు మ‌రో షాక్‌.. ఒక్క‌రికి కూడా ద‌క్క‌ని చోటు

టీమిండియా ప‌రిస్థితి గ‌త కొంత కాలంగా బాగ‌లేదు.. ఓవైపు జ‌ట్టులో జ‌రుగుతోన్న ప‌రిణామ‌లు.. మ‌రోవైపు వ‌రుస ప‌రాజ‌యాల‌తో భారత జ‌ట్టు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. ఇక‌, జ‌ట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా కిందికి దిగుతోంది.. ఈ స‌మ‌యంలో మ‌రో ఊహించ‌ని ప‌రిణామం చోటుచేసుకుంది.. క్రికెట్ అభిమానుల‌కు మ‌రో మింగుడు ప‌డ‌ని విష‌యం ఏటంటే..?టీమిండియా నుంచి ఒక్క‌రికి కూడా అవ‌కాశం ద‌క్క‌క‌పోగా.. పాకిస్థాన్‌కు అనూహ్యంగా ప్రాధాన్య‌త పెరిగిపోయింది.. దీంతో.. ఐసీసీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు భార‌త అభిమానులు..

అస‌లు విష‌యానికి వ‌స్తే.. 2021 ఏడాదికి గాను ఐసీసీ పురుషుల జట్టును ప్ర‌క‌టించింది.. అందులో ఒక్కరంటే ఒక్క భారతీయ ఆటగాడికి కూడా చోటు ద‌క్క‌క‌పోవ‌డం జీర్ణించుకోలేని విష‌యం.. ఇక‌, ఐసీసీ 2021 వన్డే జట్టుకు పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను కెప్టెన్‌గా ఎంచుకుని.. టీమిండియా అభిమానుల‌కు మ‌రింత సెగ పెట్టేసింది ఐసీసీ.. జ‌ట్టులో బాబర్ సహచరుడైన ఫకర్ జమాన్‌కూడా చోటు లభించింది. ఇద్దరు సఫారీ ఆటగాళ్లు, ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు, బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు, ఇద్దరు ఐర్లాండ్ ఆటగాళ్లకు ఐసీసీ వన్డే జట్టులో చోటు ద‌క్కింది. ఐసీసీ 2021 వ‌న్డే జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న ఆట‌గాళ్ల విష‌యానికి వ‌స్తే.. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్), జామనెమన్ మలాన్ (దక్షిణాఫ్రికా), బాబర్ ఆజం (పాకిస్థాన్), ఫకర్ జమాన్ (పాకిస్థాన్), రాసీ వాండెర్ డుసెన్ (దక్షిణాఫ్రికా), షకీబల్ హసన్ (బంగ్లాదేశ్), ముస్తాఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్), వనిందు హసరంగ (శ్రీలంక), ముస్తాఫిజుర్ రహ్మాన్(బంగ్లాదేశ్), సిమి సింగ్ (ఐర్లాండ్), దుష్మంత చమీర (శ్రీలంక) ఉన్నారు. కాగా, గ‌త ఏడాదిలో ఆట‌గాళ్ల ఇచ్చిన ప్ర‌ద‌ర్శ‌నను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఐసీసీ ప్ర‌తీ ఏడాది జ‌ట్ల‌ను ప్ర‌క‌టించే విష‌యం తెలిసిందే.