IND vs SA Tickets: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా జరగనుంది. దీంతో ఒడిశా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ తక్కువ సంఖ్యలో టికెట్లను కౌంటర్లలో విక్రయానికి (ఆఫ్‌లైన్) పెట్టింది. ఇక, టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఇక, టికెట్ కౌంటర్లు తెరుచుకోక ముందే ఉదయం నుంచి స్టేడియం బయట వేల సంఖ్యలో ఫ్యాన్స్ క్యూలైన్లలో వేచి ఉన్నారు. కౌంటర్లు ఓపెన్ కాగానే టికెట్ల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Rajamouli Avatar 3: సర్‌ప్రైజ్‌కు ప్లాన్ చేసిన జక్కన్న.. ‘అవతార్ 3’లో వారణాసి ఆట!
అయితే, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఎక్కువ సంఖ్యలో టికెట్లను వారి సభ్యులు, వీఐపీలకు కేటాయించి.. తక్కువ టికెట్లను మాత్రమే కౌంటర్లలో విక్రయానికి పెట్టడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, టికెట్ల ధరలు రూ.700 నుంచి రూ.20 వేల మధ్య ఉన్నాయి. ఇక, ఈ క్రమంలో ఆఫ్‌లైన్ టికెట్ల కోసం శుక్రవారం బారాబతి స్టేడియం వద్ద ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందు రోజు రాత్రి 11. 30 గంటలకే కొంత మంది మైదానం దగ్గరే పడిగాపులు కావడం గమనార్హం.
అలాగే, టికెట్ ధర రూ. 1100 ఉండగా.. దానిని 6 వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా ఓవైపు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పట్టించుకోకపోవడం దారుణం అని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక, సఫారీతో టీమిండియా టీ20 మ్యాచ్‌లు కటక్, ముల్లాన్‌పుర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.
