ఐపీఎల్ తర్వాత టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. రోజురోజుకు గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆల్‌రౌండర్లు దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలతో పాటు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా గాయాల కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ కూడా ఈ జాబితాలో చేరాడు.
ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్షల్ పటేల్ చేతికి గాయమైంది. దీంతో అతడు ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. రెండు, మూడు రోజుల్లో హర్షల్ గాయం తీవ్రతపై స్పష్టత రానుంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు వారాలకు పైగా సమయం పట్టనుంది. చేతికి ఎన్ని కుట్లు పడ్డాయనే అంశంపై హర్షల్ పటేల్ కోలుకునే టైం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో అతడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడే పరిస్థితి లేదని తెలుస్తోంది. కాగా టీమిండియా ఆడనున్న మూడు అప్‌కమింగ్ సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసేందుకు చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఈనెల 23న సమావేశం కానుంది. మే 25న జట్లను ప్రకటించే అవకాశం ఉంది.