Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!

  • తొలి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి
  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
  • ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై బ్రూక్ నిరాశ
Harry Brook Interview

Harry Brook Interview

Harry Brook Reaction on England Defeat vs India in 1st ODI: మంగళవారం ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఇంగ్లండ్‌ 258 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలోనే 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో కీలక సమయంలో వరుసగా ఐదు వికెట్లు కోల్పోవడమే తమ పరాజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. రెండో వన్డేలో మరింత బలంగా తిరిగి వస్తామని, టీమిండియాపై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

‘మొదటి వన్డేలో మా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడం మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ దశలోనే మ్యాచ్‌పై మేము పట్టును కోల్పోయాం. అయినప్పటికీ చివర్లో జో రూట్, లియామ్ డాసన్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా తీసుకెళ్లారు. చివర్లో వచ్చిన చిన్నచిన్న భాగస్వామ్యాలు కూడా మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ పరిస్థితుల్లో 260 పరుగులు చేయడం గొప్ప విషయం. ఈ క్రెడిట్ రూట్, డాసన్‌లకే దక్కుతుంది’ అని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చెప్పాడు.

‘260 పరుగుల లక్ష్యాన్ని మా బౌలర్లు కాపాడగలమనే నమ్మకం ఉంది. ఇన్నింగ్స్ విరామ సమయంలో పిచ్ కొంత నెమ్మదించింది. అదే పరిస్థితి కొనసాగితే మా బౌలర్లకు అనుకూలంగా మారుతుందని అనుకున్నాం. కానీ భారత బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. ఐదు నుంచి ఆరు పరుగుల రన్‌రేట్‌తో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. పిచ్ స్వభావం మారడంతో మా వ్యూహాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మేము ఎప్పుడూ పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేస్తాం. ఈ మ్యాచ్‌లో మరో 60-70 పరుగులు చేసి 320 లేదా 330 స్కోరు సాధించి ఉంటే మా స్పిన్నర్లు మ్యాచ్‌లో మరింత ప్రభావం చూపేవారు. కానీ మిడిల్ ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోవడం వల్ల ఆ అవకాశం లేకుండా పోయింది. అదే మా ఓటమికి ప్రధాన కారణం’ అని అన్నాడు.

రెండో వన్డేకు ముందు ఆందోళన ఏమీ లేదని బ్రూక్ స్పష్టం చేశాడు. ‘ఇప్పుడు మేము కార్డిఫ్‌కు వెళ్తాం. అక్కడ పిచ్‌ను పరిశీలించి జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకుంటాం. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకుని రెండో వన్డేలో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాం. కచ్చితంగా టీమిండియాను ఓడించడానికే చూస్తాం. సిరీస్‌ను సమం చేయడానికి ప్రయత్నిస్తాం’ అని హ్యారీ బ్రూక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.