న్యూజిలాండ్ పర్యటన సమయంలో తాను చేసిన తప్పుకు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్షమాపణలు తెలిపాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బ్రూక్కు ‘ఫైనల్ వార్నింగ్’ ఇచ్చి.. 30,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.36.29 లక్షలు) జరిమానాగా విధించింది. మద్యం మత్తులో ఓ నైట్‌క్లబ్ వద్ద గొడవకు దిగడమే ఇందుకు కారణం. 2025 నవంబర్ 1న ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రూక్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. అందుకే ఈసీబీ అతడిని ఫైనల్ వార్నింగ్ అంటూ హెచ్చరించింది.
వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మూడో వన్డేకు ముందు హ్యారీ బ్రూక్ తన సహచర క్రికెటర్లతో కలిసి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లాడు. మద్యం తాగి ఉన్నాడనే అనుమానంతో బ్రూక్‌ను బౌన్సర్‌లు లోపలికి అనుమతించలేదు. నైట్ క్లబ్‌లోకి తన ప్రవేశాన్ని నిరాకరించడంతో అక్కడి బౌన్సర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. బ్రూక్‌పై బౌన్సర్ చేయిచేసుకున్నాడు. ఈ ఘటన అనంతరం బ్రూక్ స్వయంగా టీమ్ మేనేజ్‌మెంట్‌కు విషయం చెప్పాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన ఈసీబీ.. బ్రూక్‌కు రూ.36.29 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు ఈసీబీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. బ్రూక్ తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు.
హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ… ‘నా ప్రవర్తనకు హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నాను. నా చర్యలు తప్పని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ ఘటన నన్ను, ఇంగ్లండ్ జట్టును కూడా ఇబ్బందికి గురిచేశాయి. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవం. ఆ బాధ్యతను నేను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులను నిరాశపరిచినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. భవిష్యత్తులో మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా సరైన ప్రవర్తనతో నడుచుకుంటా. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటా’ అని చెప్పాడు.
ఈసీబీ ప్రతినిధి మాట్లాడుతూ… ‘ఈ ఘటనపై మాకు పూర్తి సమాచారం ఉంది. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాం. క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. హ్యారీ బ్రూక్ క్షమాపణలు చెప్పాడు. తన ప్రవర్తన సరిగా లేదని అంగీకరించాడు’ అని తెలిపారు. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత బ్రూక్ శుక్రవారం స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ఇక జనవరి 19న శ్రీలంక పర్యటనకు బయలుదేరనున్నాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
