Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Harmanpreet Kaur T20wc

Harmanpreet Kaur T20wc

Harmanpreet Kaur About Women’s Asia Cup Final 2026: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంకతో జరగనున్న టైటిల్ పోరులో అనవసరంగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ప్రయత్నించకుండా.. తమ బలాలపై నమ్మకం ఉంచి ఆడాలని జట్టు సభ్యులకు సూచించింది. ఫైనల్ రోజు ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆడితే వారిదే విజయమని పేర్కొంది. శ్రీలంక స్టార్ ఓపెనర్ చమరి ఆటపట్టు డేంజరస్ ప్లేయర్ అని, ఆమెను త్వరగా ఔట్ చేయకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హర్మన్‌ప్రీత్ తెలిపింది.

‘కీలకమైన మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన బలాలపైనే దృష్టి పెట్టాలి. అనవసరంగా ఎక్కువ ప్రయోగాలకు వెళ్లకూడదు. అసాధారణంగా ఏదైనా చేయాలని ప్రయత్నించడం కంటే.. మన సామర్థ్యాన్ని నమ్ముకుని, ఆత్మవిశ్వాసంతో ఆడటం ముఖ్యం. మన అంతర్గత భావనను విశ్వసించాలి’ అని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. గత ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమిని కూడా భారత కెప్టెన్ గుర్తు చేసుకుంది. 2024లో దంబుల్లాలో జరిగిన ఫైనల్లో భారత్ 165 పరుగులు చేసినప్పటికీ.. శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈసారి ఫైనల్‌ను బలమైన జట్టు, బలహీనమైన జట్టు మధ్య పోరుగా చూడటం లేదని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేసింది.

‘గతసారి శ్రీలంక మాపై చాలా బాగా ఆడింది. టీ20 క్రికెట్‌లో ఆ రోజు ఎవరు మెరుగైన క్రికెట్ ఆడితే వారే గెలుస్తారు. ఏ జట్టు బలమైనది, ఏ జట్టు బలహీనమైనది అనే దానిపై సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ రోజున ఎవరు మంచి క్రికెట్ ఆడతారన్నదే ముఖ్యం. టోర్నీలో భారత జట్టులోని ఆటగాళ్లు కీలక సమయాల్లో బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉంది. అవకాశాలు లభించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణిస్తున్నారు. కఠినమైన పరిస్థితుల్లోనూ భారత బ్యాటింగ్ యూనిట్ పరుగులు సాధించింది. బౌలర్లు కూడా తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు’ అని చెప్పుకొచ్చింది.

దుబాయ్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదని హర్మన్‌ప్రీత్ అంగీకరించింది. బ్యాటర్లు తొలుత క్రీజులో కొంత సమయం గడిపిన తర్వాతే షాట్లకు వెళ్లాలని సూచించింది. ‘ఈ పిచ్‌పై బ్యాటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే మనల్ని మనం నమ్ముకోవాలి. మన బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. ఎవరు బాగా ఆడతారో వారు బాధ్యత తీసుకుని చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాలి. శ్రీలంక బౌలింగ్ బాగుంది. పిచ్‌పై తమ ప్రణాళికలను శ్రీలంక బౌలర్లు సమర్థంగా అమలు చేస్తున్నారు. క్రీజులో కుదురుకున్న బ్యాటర్ చివరి వరకు బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం’ అని పేర్కొంది.

శ్రీలంక స్టార్ ఓపెనర్ చమరి ఆటపట్టు గురించి మాట్లాడుతూ.. ఆమెను వీలైనంత త్వరగా ఔట్ చేయాలని భారత్ భావిస్తోందని హర్మన్‌ప్రీత్ తెలిపింది. ‘చమరి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మాకు తెలుసు. అందుకే ఆమెపై ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగుతాం. ఆమె ఒక్కరిపైనే కాకుండా శ్రీలంక బ్యాటింగ్ మొత్తం మీద దృష్టి పెడతాం. టాస్ అనేది కెప్టెన్ చేతుల్లో ఉండే విషయం కాదు. దుబాయ్ పరిస్థితులపై ఇప్పటికే పూర్తి అవగాహన వచ్చింది. దాదాపు రెండు వారాలుగా అక్కడే క్రికెట్ ఆడుతున్నందున పిచ్, పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నాము. తమ ప్రణాళికలను నమ్ముకుని, వాటిని సమర్థంగా అమలు చేయడమే ముఖ్యం’ అని పేర్కొంది.