Site icon NTV Telugu

Harmanpreet Kaur Record: మాజీ దిగ్గజం రికార్డును సమం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్‌!

Harmanpreet Kaur Record

Harmanpreet Kaur Record

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత ప్రదర్శన చేసింది. 43 బంతుల్లో 68 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఈ అవార్డుతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరో అరుదైన రికార్డును సమం చేసింది. భారత మహిళల టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు గెలిచిన క్రికెటర్‌గా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రికార్డును సమం చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్‌, మిథాలీ ఇద్దరూ టీ20ల్లో భారత్‌ తరఫున 12 ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు అందుకున్నారు. మిథాలీ 89 టీ20 మ్యాచ్‌లలో 12 ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకోగా.. హర్మన్‌ 187 టీ20 మ్యాచుల్లో ఈ ఘనత సాధించింది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2009లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఇప్పటివరకు 187 మ్యాచ్‌లు (167 ఇన్నింగ్స్‌లు) ఆడి 3784 పరుగులు చేసింది. టీ20ల్లో ఆమె సగటు 29.33 కాగా.. ఒక సెంచరీతో పాటు 15 అర్ధసెంచరీలు సాధించింది. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హర్మన్‌ప్రీత్‌ 130 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ఆమె స్ట్రైక్‌రేట్‌ 131.31 కాగా, సగటు 65.00గా ఉంది.

Exit mobile version