ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు రంగప్రవేశం చేయనున్నాయి. వాటిలో ఒకటి అహ్మదాబాద్ జట్టు కాగా మరొకటి లక్నో జట్టు. ఈ రెండు జట్లు ఈనెల 22లోపు తమ జట్టులో ఉండే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఐపీఎల్ పాలకమండలికి నివేదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ జట్టులో హార్డిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ ఆడతారని అహ్మదాబాద్ జట్టు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇంకా ఐపీఎల్ మెగా వేలం జరగలేదు. కానీ ముందస్తుగా ఆయా ఆటగాళ్లతో అహ్మదాబాద్ జట్టు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. ఈ ముగ్గురు ఆటగాళ్లకు కలిపి అహ్మదాబాద్ జట్టు ఫ్రాంచైజీ రూ.33 కోట్లు వెచ్చించింది. పాండ్యాకు రూ.15 కోట్లు, రషీద్ ఖాన్‌కు రూ.11 కోట్లు, శుభమన్‌గిల్‌కు రూ.7 కోట్ల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది.
Read Also: ఐపీఎల్‌కు మరో ఇంగ్లండ్ ఆటగాడు దూరం
రానున్న ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీగా బరిలోకి దిగుతున్న అహ్మదాబాద్ జట్టుకు హార్డిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ముందుగా శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను తీసుకుందామని ఫ్రాంచైజీ భావించినా చివరిగా పాండ్యా, రషీద్, గిల్‌ను తీసుకోవాలని నిర్ణయించుకుంది. కాగా పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల శుభ్‌మన్ గిల్ టీమిండియా తరఫున 10 టెస్టులు, 3 వన్డేలు ఆడినా అంతర్జాతీయ టి20ల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడిన గిల్ 10 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 1,417 పరుగులు సాధించాడు.
