ఆగండి.. ఆగండి.. తొందరపడకండి! రోహిత్ శర్మను టీ20 జట్టు కెప్టెన్‌గా తొలగించడం లేదు. కాకపోతే.. అతడు లేనప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలా? అనే విషయంపైనే ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రిషభ్ పంత్‌కి దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే! అప్పుడు అతని కెప్టెన్సీపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మొదట్లో రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు, పంత్‌ని తప్పించాల్సిందేనంటూ తారాస్థాయిలో విజ్ఞప్తులు వచ్చాయి. ఆ తర్వాత మరో రెండు మ్యాచెస్‌లో టీమిండియా నెగ్గడంతో, ఆ విమర్శలు తగ్గాయి. కానీ, పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడన్న వాదనలైతే వినిపించాయి.
ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. ఇతని కెప్టెన్సీలో రీసెంట్‌గా ఆ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో, హార్దిక్ కెప్టెన్సీపై ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. అంతకుముందే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఘనతను హార్దిక్ సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా ఆ జట్టుని నడిపించిన తీరు పట్ల అతడు మన్ననలు పొందాడు. ఇప్పుడు అతడు కెప్టెన్ పగ్గాలు పట్టిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా గెలిచింది. ఫలితంగా.. అతడ్ని గోల్డెన్ లెగ్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా.. టీ20 జట్టుకి హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ యోచిస్తోందట!
టీ20 ప్రపంచకప్-2022 తర్వాత టీమిండియా వరుసగా పలు టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ బిసీ షెడ్యూల్‌లో రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి, అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని దాదాపు బీసీసీఐ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మ స్థానాన్ని వేరే ఆటగాడితో భర్తీ చేసే అవకాశం లేదు కానీ, అతనిపై పని ఒత్తిడిని తగ్గించే మార్గాల్ని అన్వేషిస్తున్నాం. ఇందులో భాగంగానే హార్దిక్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొన్ని టూర్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు.