Site icon NTV Telugu

Hardik Pandya: సెమీస్‌లో ఓటమి బాధించింది.. కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: ఈ నెల 18 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిపోయినందుకు నిరాశగా ఉందన్నాడు. అయితే విజయం సాధించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్ రెడీ చేసుకుంటామని పాండ్యా చెప్పాడు.

Read Also: Narayana Murthy: దగ్గుమందుతో చిన్నారుల మరణాలు మనకు సిగ్గుచేటు

ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రెండో సిరీస్ ఇదే. అంతకుందు ఐర్లాండ్‌తో సిరీస్‌లో కూడా హార్దిక్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో జరిగే సిరీస్‌లో జట్టును ఎలా నడిపిస్తాడో వేచి చూడాలి. అటు భారత్‌తో సొంతగడ్డపై జరిగే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. అయితే గప్తిల్, బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లను సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. కొత్త స్టార్ ఫిన్ అలెన్‌కు స్థానం కల్పించేందుకు గప్తిల్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. బౌల్ట్ స్థానంలో యువ బౌలర్లకు అవకాశం కల్పించాలని న్యూజిలాండ్ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈనెల 18న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20, ఈనెల 20న రెండో టీ20, 22న మూడో టీ20 జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షప్రసారం చేయనుంది.

Exit mobile version