Site icon NTV Telugu

Team India: అరుదైన రికార్డు సాధించిన హార్డిక్ పాండ్యా

Hardik Pandya

Hardik Pandya

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హార్డిక్ పాండ్యా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వికెట్ తీసిన తొలి టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్ బౌలింగ్ వేసిన పాండ్యా… ఐర్లాండ్ ఓపెనర్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇంత వరకు టీ20ల్లో టీమిండియా జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాళ్లు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. గతంలో భారత జట్టుకు టీ20 ఫార్మాట్‌లో ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రహానే, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్ నాయకత్వం వహించారు. వీళ్లకు సాధ్యం కాని రికార్డును హార్డిక్ పాండ్యా సాధించాడు.

భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్‌ను వర్షం కారణంగా అంపైర్లు 12 ఓవర్లకే కుదించారు. దీంతో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హ్యారీ టెక్టార్‌ (64 నాటౌట్‌; 33 బంతుల్లో 64, 36) హాఫ్ సెంచరీ బాది ఐర్లాండ్‌కు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. అయితే టీమిండియా ఈ లక్ష్యాన్ని 9.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌గా దిగిన దీపక్ హుడా ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 47 పరుగులతో అతడు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌ తొలి బంతి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్పీడ్ మీటర్ ఏకంగా ఆ బంతి వేగాన్ని గంటకు 201 కిలోమీటర్లుగా చూపించింది. కానీ అది స్పీడ్ మీటర్ తప్పిదమని తేలడంతో సోషల్ మీడియాలో నెటిజన్‌లు మీమ్స్ చేస్తున్నారు.

IND Vs IRE: రాణించిన దీపక్ హుడా, చాహల్.. తొలి టీ20లో టీమిండియా విజయం

Exit mobile version