టీమిండియా దిగ్గజ బౌలర్ హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే హర్భజన్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్వయంగా హర్భజన్ వెల్లడించాడు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి సేవ చేయాలని భావిస్తున్నానని.. అయితే అది రాజకీయాల రూపంలోనా లేదా ఇతర రూపంలోనా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భజ్జీ తెలిపాడు.
తనకు రాజకీయ రంగం గురించి తెలుసు అని… అవి ఎలా ఉంటాయో తనకు ఐడియా ఉందని హర్భజన్ చెప్పాడు. తాను రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీలో చేరినా తప్పకుండా ముందే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తనకు వివిధ పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయని… ఇందులో ఎలాంటి అబద్ధం లేదన్నాడు. ఓ క్రికెటర్ హోదాలోనే ఇటీవల పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్యజోత్ సింగ్ సిద్దూతో సమవేశమయ్యానని హర్భజన్ క్లారిటీ ఇచ్చాడు.
