Gautham Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ ఎప్పుడు చూసినా విరాట్ కోహ్లీ టార్గెట్‌గా కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా అతడు మరోసారి కోహ్లీపై తన అక్కసు వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న కోహ్లీని చూసి సహించలేక తన నోటికి పనిచెప్పాడు. విరాట్ కోహ్లీ కంటే సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరని గంభీర్ అభిప్రాయపడ్డాడు. దీనికి కారణాలను కూడా విశ్లేషించాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాదిరిగా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే సదుపాయం సూర్యకుమార్ యాదవ్‌కు లేదన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఉంటారని.. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చి బౌండరీలు బాదడం అంటే మామూలు విషయం కాదని గంభీర్ అన్నాడు.
Read Also: త్వరలో రాబోతున్న సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్
అంతేకాకుండా క్రీజులోకి రాగానే సిక్స్ కొట్టే సామర్థ్యం సూర్యకుమార్ సొంతం అని.. ఈ తరహాలో విరాట్ కోహ్లీ కానీ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ చేయలేరని గంభీర్ వెల్లడించాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే మిగిలిన బ్యాటర్ల నుంచి ఒత్తిడిని తొలగించగలడని.. అందుకే అతడు బెస్ట్ బ్యాటర్ అని అభివర్ణించాడు. ఇటీవల నెదర్లాండ్స్ మ్యాచ్‌ను చూస్తే.. సూర్యకుమార్ వచ్చీ రాగానే బౌండరీలు కొట్టడం వల్లే విరాట్ కోహ్లీపై ఒత్తిడి పోయి స్వేచ్చగా ఆడగలిగాడని గంభీర్ తెలిపాడు. కోహ్లీ మంచి ప్లేయరే అయినా బెస్ట్ బ్యాటర్ మాత్రం కాదన్నాడు. సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా నిలకడగా రాణిస్తే టీమిండియా ప్రపంచకప్ గెలవడం కష్టమేమీ కాదన్నాడు. కాగా గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్లిద్దరూ ఢిల్లీకి చెందిన ఆటగాళ్లు కావడం గమనించదగ్గ విషయం.
